నో ఎస్కేప్: చంద్రబాబుకు సమన్లు, కానీ...?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డికి చెందిన నోటుకు ఓటు కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సమన్ల నుంచి తప్పించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేదని అంటున్నారు. విచారణ నుంచి తప్పించుకోని రీతిలో చంద్రబాబుకు నోటీసు జారీ చేయాలని ఎసిబి భావిస్తున్నట్లు సమాచారం.
సిఆర్‌పిసి సెక్షన్ 40 కింద నోటీసు జారీ చేస్తే దాన్ని కొట్టేయాలని తెలుగుదేశం పార్టీ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దీంతో చంద్రబాబు విచారణ నుంచి తప్పించుకోకుండా సిఆర్‌పిసి 160 కింద నోటీసు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.

రేవంత్ రెడ్డికి చెందిన ఓటు నోటు కేసులో ఎసిబి అధికారులు చంద్రబాబును సాక్షిగానే విచారించనున్నట్లు, ఇందుకు అనుగుణంగానే నోటీసు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, తొలి దశలో సాక్షిగా చంద్రబాబును విచారించి, ఆ తర్వాత విచారణలో తేలిన అంశాలను, తాము సేకరించిన సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఆంగ్లో ఇండియన్ శాసనసభ్యుడు స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఆడియో టేప్ సంభాషణలను ప్రాతిపదికగా తీసుకుని చంద్రబాబును విచారించేందుకు ఎసిబి అధికారులు సిద్ధపడుతున్నట్లు సమాచారం. నిజానికి, కేసులో ఇరికిస్తూ చంద్రబాబుకు సిఆర్‌పిసి 40 కింద నోటీసు జారీ చేయాలని ఎసిబి అధికారులు అనుకున్నారు. అయితే, కేసులోని సంక్లిష్టతను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబును సాక్షిగానే పరిగణిస్తూ సిఆర్‌పిసి సెక్షన్ 160 కింద విచారించడానికి సమన్లు జారీ చేస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications