జగన్ పార్టీలో డిమాండ్: టిడిపి వైపు 50మంది
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ తెలంగాణ నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన పలువురు కాంగ్రెసు నేతలు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వైపు చూస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలలో టిక్కెట్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. ఆ రెండు పార్టీల తర్వాత ఇంకొందరు జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో టిక్కెట్స్ కోసం డిమాండ్ బాగా పెరిగింది.
గోదావరి జిల్లాలో ప్రముఖ విద్యా సంస్థల ప్రతినిధులు టిడిపి టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. కాంగ్రెసు పార్టీలోని సిట్టింగ్ ప్రజాప్రతినిధులతో పాటు ఇతరులు కూడా టిడిపి, జగన్ పార్టీల వైపు చూస్తున్నారట. గత నెల రోజులుగా టిడిపి పెద్దలతో పలువురు నాయకులు చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. విద్యాసంస్థల ప్రతినిధులు పరుచూరి కృష్ణా రావు, విశ్వం తదితరులు కాకినాడ లోకసభ స్థానం కోసం పోటీ పడుతున్నారట.

మరో మహిళా నేత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి అమలాపురం పార్లమెంటు స్థానం బరిలో దిగేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు. ఆమెకు ఇటీవలె జగన్ పార్టీలో చేరిన మాజీ మంత్రి పినిపె విశ్వరూప్ నుండి పోటీ ఉందంటున్నారు. జగన్ పార్టీలో ఇతర నియోజకవర్గాల్లోను ఇలాంటి పోటీ నెలకొంది.
సీమాంధ్రలో పెద్ద మొత్తంలో టిడిపి వైపు!
'తెలంగాణ' నేపథ్యంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నుండి తమ పార్టీలోకి దాదాపు యాభై మంది నేతలు వస్తారని టిడిపి భావిస్తోంది. తెలంగాణ ఇచ్చినందువల్ల కాంగ్రెసు నుండి, విభజనలో ఆ పార్టీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సహకరిస్తున్నందువల్ల ఆ పార్టీ నుండి టిడిపిలోకి వస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. తమ పార్టీలోకి నలభై నుండి యాభై మంది ఎమ్మెల్యేలు వస్తారని భావిస్తున్నామని ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు అంటున్నారు. జనవరి 23వ తేదీ తర్వాత రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయంటున్నారు.
ఇప్పటికే మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డి, గంటా శ్రీనివాస రావులు సహా పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. పార్టీలో చేరే వారిని చేర్చుకుంటామని, అదే సమయంలో ఇప్పటికే ఉన్న తమ నేతలకు ఇబ్బందులు తలెత్తకుండా చేరికలు ఉంటాయని యనమల చెబుతున్నారు.












Click it and Unblock the Notifications