జగన్‌కు బెజవాడ భయం: చుట్టూ 150 మంది బౌన్సర్స్?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. విజయవాడలో బస చేయడానికి గానీ, అక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గానీ ఆయన ఇష్టపడడం లేదని అంటున్నారు. ప్రభుత్వం కల్పించిన భద్రతపై ఆయనకు నమ్మకం లేకనే ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే జగన్ భయపడే నాయకుడు కారని పార్టీ వర్గాలంటున్నాయి.
జగన్ సొంతంగా 150 మంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది. విజయవాడలో తనకు భద్రత తక్కువగా ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దాంతో తన రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడలో కన్నా గుంటూరులో ఏర్పాటు చేసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, గుంటూరులో ఆఫీసుకు గానీ, ఇంటికి గానీ స్థలం లభించడం లేదని అంటున్నారు.

అధికార పార్టీకి భయపడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి స్థలం ఇవ్వడానికి భయపడుతున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర కార్యాలయాన్ని హైదరాబాదు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మార్చడానికి చాలా కాలంగానే జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ముందుగా గుంటూరు సమీపంలోని రెడ్డిపాలెంలో స్థలం కోసం గాలించారు. స్థలం, అన్నీ బాగున్నా అది రాజధానికి దూరం కావడంతో పాటు భద్రతా కోణంలో సురక్షితం కాకపోవడంతో జగన్ దాన్ని తిరస్కరించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
విజయవాడలో ఏదైనా కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చినా అది ముగిసిన వెంటనే హైదరాబాద్ వెళుతున్నారు. శ్రీకాకుళం వెళ్లినా ముందు నిర్ణయించిన చోట కాకుండా మరో చోట బస చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తన భద్రతకు విజయవాడ కన్నా గుంటూరు బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. అయితే వెలగపూడిలోనే సచివాలయం, అసెంబ్లీ నిర్మిస్తున్నందున అక్కడికి సమీపంలో స్థలం తీసుకుంటే బాగుంటుందని పార్టీ నేతలు ఆయనకు సూచించారు.

దాంతో కొద్దికాలం నుంచి నేతలు ఆ ప్రాంతంలో స్థలం కోసం ప్రయత్నాలు చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అధికార పార్టీ భయంతో ఎవరూ స్థలం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని చెబుతున్నారు. జగన్‌కు సన్నిహితుడైన బాలాజీరెడ్డి తన స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే వెలగపూడికి సమీపంలో అయితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిన జగన్, అక్కడ సమీపంలోనే చూడాలని సూచించారని వార్తలు వచ్చాయి.
ఈ స్థితిలో ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఉండవల్లికి సమీపంలోని తన స్థలంలో తాత్కాలిక పార్టీ ఆఫీసు నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications