సమైక్యాంధ్ర స్టార్ బ్యాట్స్‌మన్ అవుటయ్యాడా?
హైదరాబాద్: సమైక్యాంధ్ర స్టార్ బ్యాట్స్‌మన్ కిరణ్ కుమార్ రెడ్డి అవుటైనట్లే కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పట్టించుకోకుండా కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌ను ఆమోదించింది. కిరణ్ కుమార్ రెడ్డిని పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అడుగులు ముందుకు వేయాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుందని అంటున్నారు.
ఆంటోనీ కమిటీ రాష్ట్రానికి రాకుండా తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగదని చెప్పినప్పటికీ టి.నోట్ కేంద్ర మంత్రివర్గం ముందుకు రావడం, దానికి ఆమోదం లభించడంతో తన భవిష్యత్తు కార్యాచరణపై ముఖ్యమంత్రి సన్నిహితులతో సమాలోచనలు జరిపినట్లు చెబుతున్నారు. పార్టీలోనే కొనసాగాలా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వౌనంగా ఉండిపోవాలా అనే విషయంపై నేరుగా అధిష్టానం వద్దనే తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో శాసనసభలో చర్చకు బిల్లు వచ్చేంత వరకు వేచి చూసి బిల్లు వీగేలా చేయడం ద్వారా మెజారిటీ ప్రజలు, ప్రజాప్రతినిధులు విభజనకు వ్యతిరేకంగా ఉన్నారని చెబుతూ, రాష్టప్రతి నిర్ణయం సందిగ్ధంలో పడేలా చూడాలా అనే కోణంలో కూడా ఆయన సహచరులతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక అధిష్టానంతోనే అమీతుమీ కోసం మూడు నాలుగు రోజుల్లో ఢిల్లీకి వెళ్లేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు ఆయన సన్నిహిత మంత్రులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ గురువారం మధ్యాహ్నం కూడా విభజన జరగదని, కేబినెట్‌లోకి నోట్ రాదని ధీమా వ్యక్తం చేశారు. తనను కలిసిన మంత్రులకు కూడా ఇదే స్పష్టం చేశారు. అయితే ఆయన అభిప్రాయాలు ఒక్కసారిగా తల్లకిందులయ్యాయి. సీమాంధ్ర ప్రజల దృష్టిలో హీరోగా మారినప్పటికీ చివరకు అధిష్టానం అనుకున్నది అమలు చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి వర్గం కంగు తిన్నట్లు చెబుతున్నారు.
వాస్తవానికి ముఖ్యమంత్రి విభజనకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, ఆయన సీమాంధ్ర సహచరుల్లో కొంతమంది అధిష్టానం నిర్ణయానికి బద్ధులుగా ఉంటామంటూ ఒకరకంగా విభజనకు అవకాశం కల్పించారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విధానం వెనుక, పలువురు మంత్రులు కిరణ్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో అధిష్టానం హస్తం కూడా ఉండవచ్చునని కిరణ్ అనుకూల మంత్రులు అనుమానిస్తున్నారు.
విభజన ప్రక్రియను అనుకున్న రీతిలో పూర్తి చేసేందుకే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సీమాంధ్ర మంత్రుల చేత చెప్పించారని కిరణ్ అనుకూల మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రి ఆనం రాంనారాయం రెడ్డి నేతృత్వంలో పలువురు మంత్రులు ముఖ్యమంత్రిని కలుసుకోగా, ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. సీమాంధ్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులంతా కలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications