కిరణ్ రెడ్డి లేఖాస్త్రం: అధిష్టానంపై ధిక్కారమా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన తీరును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు. కాంగ్రెసు అధిష్టానంపై తిరుగుబాటులో భాగంగానే ఆయన ఈ లేఖలు రాసినట్లు ప్రచారం సాగుతోంది. ఆయన ఈ నెల 22వ తేదీన ఆ లేఖలు రాశారు. లేఖల్లో వాడిన పదజాలం వాడి పలు అనుమానాలకు తావు ఇస్తోందని అంటున్నారు. రాష్ట్ర విభజన విషయంలో గత సంప్రదాయాలను పాటించాలని ఆయన కోరారు. సంప్రదాయాలను పక్కన పెట్టే పద్ధతిని ఆయన వ్యతిరేకించారు.
ప్రజాస్వామ్యంలో గత సంప్రదాయాలు కూడా రాజ్యాంగంతో సమానమేనని తెలిపారు. విభజన ప్రక్రియను బలవంతంగా, హడావిడిగా రుద్దుతున్నారనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే పదాలను ఎక్కడా వాడకుండానే మూడు పేజీల లేఖ రాశారు. 'ప్రజలు, మెజారిటీ ప్రజలు, మెజారిటీ ప్రజల అభిప్రాయాలు' అంటూ పలు అంశాలను లేవనెత్తారు. నదీ జలాలు, 371 (డీ) తదితర అంశాలను ప్రస్తావిస్తూ... 'హైదరాబాద్ అవకాశాల గని' అని వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి విజ్ఞతను, సచ్ఛీలతను కొనియాడుతూనే, 'విభజనకు ప్రత్యక్ష బాధితుడిగా' అభివర్ణించారు. గత సంప్రదాయాలను అనుసరిస్తూ విభజన అంశాన్ని అసెంబ్లీ తీర్మానం కోరతారనే 'కనీస మర్యాద'ను భారతప్రభుత్వం నుంచి ఆశిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. 2014 వరకు రాష్ట్ర విభజనను ఆపగలిగితే చాలుననే వ్యూహంతో ఆయన ఈ లేఖాస్త్రాన్ని సంధించినట్లు చెబుతున్నారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల ఏర్పాట్లపై అనుసరించిన సంప్రదాయాలను ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అనుసరించాలని, రాష్ట్ర విభజన తీర్మానాన్ని, బిల్లును అసెంబ్లీకి పంపించాలని ఆయన అన్నారు.
ఆర్టికల్-3 ప్రకారం రాష్ట్రాల విభజన అధికారం కేంద్రానికి ఉందని, అయితే, ఇప్పటిదాకా ఏర్పడిన రాష్ట్రాలన్నీ అసెంబ్లీ తీర్మానాల ద్వారానే ఏర్పడ్డాయని ముఖ్యమంత్రి గుర్తు చేస్తున్నారు. కేబినెట్ నోట్ తయారైన తీరుపై కిరణ్ తన లేఖలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ ప్రక్రియను పక్కనపెట్టి అరగంటలోనే కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్ పెట్టడాన్ని, అది కూడా టేబుల్ ఐటమ్‌గా పెట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. లేఖలోని అంశాలను చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి ధిక్కారంతో వ్యవహరించినట్లుగానే భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications