బాబుకు కేంద్రం మరో షాక్: పోలవరంపై మెలిక
హైదరాబాద్: ఇతర రాష్ట్రాలతో పాటు సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం తమకు అన్ని రకాల సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కేంద్ర ప్రభుత్వం షాక్ మీద షాక్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని దాదాపు తేల్చేసిన కేంద్రం ఇప్పుడు తాజాగా పోలవరం ప్రాజెక్టుపై మెలిక పెట్టింది.
పోలవరం ప్రాజెక్టు అథారిటీతో, బడ్జెట్ కేటాయింపులతో నిమిత్తం లేకుండా రీయింబర్స్‌మెంట్ విధానంలో బిల్లులు చెల్లించాలని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అంటే, ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత బిల్లులు పంపిస్తే కేంద్రం వాటిని భర్తీ చేస్తుంది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక బిల్లుల చెల్లింపు విభాగానికి లేఖ రాసింది. ఏపీకి ఈ విధానం పెద్ద దెబ్బనే కాగలదు.
వచ్చే నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేయాలన్న ఏపీ ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చేలా ఉందని అంటున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎపి ముందుగా ప్రాజెక్టుపై ఖర్చు చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన సంగతి తెలిసిందే. నేరుగా కేంద్రమే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రత్యేకంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీని కూడా నియమించింది. దీనికి సీనియర్ ఐఏఎస్ అధికారి దినే్‌షకుమార్ సీఈవోగా ఉన్నారు.

ఇటీవల కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కూడా పీపీఏ సమావేశం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్‌లో పోలవరానికి వంద కోట్ల రూపాయలు కేటాయించడంపై ఏపీ తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో నిధుల కేటాయింపు, ప్రాజెక్టు స్థితిగతులపై చర్చ జరిపారు.
తాజాగా ఈ నెల 13న కూడా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశమయింది. ఇప్పటిదాకా ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చు వివరాలు సమర్పించాలని కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఏపీ ప్రభుత్వ ఆందోళనను పరిగణలోకి తీసుకొని పీపీఏ ద్వారా ఎక్కువ నిధులు కేటాయిస్తారని అంతా అనుకుంటున్న సమయంలో పోలవరానికి యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ) ద్వారానే బిల్లులు చెల్లించాలన్న ఆదేశం వచ్చింది.
ఈ ఆదేశాల ప్రకారం, ఏటేటా పోలవరం నిర్మాణ ఖర్చును తొలుత ఏపీ ప్రభుత్వం భరించాలి. ఆ తర్వాత నిధుల వినియోగ ధృవీకరణ పత్రాన్ని (యూసీ)ని కేంద్ర సర్కారుకు సర్పించాలి. ఆ తర్వాతే ఏపీ పోలవరంపై ఖర్చుపెట్టిన నిధులను కేంద్రం రీయింబర్స్‌మెంట్ రూపంలో విడుదల చేస్తుంది.
ఉదాహరణకు 2015-16లో పోలవరం కోసం ఏపీ ప్రభుత్వం 250 కోట్లు సొంతగా ఖర్చుపెట్టాలి. ఆ ఖర్చుకు సంబంధించిన యూసీని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపించాలి. ఆ యూసీపై కేంద్రం సంతృప్తి చెందితే నిధులు వస్తాయి. అంతేకాకుండా. పూర్తిగా రీయింబర్స్‌మెంట్ రావొచ్చు...లేదా సగం, అంతకన్నా తక్కువయినా రీయింబర్స్‌మెంట్ రావొచ్చు. ఇది ఎపి ప్రభుత్వానికి మింగుడు పడని వ్యవహారమే.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సర్కారు 15 వేల కోట్ల రెవెన్యూ లోటులో ఉంది. ఈ పరిస్థితుల్లో పోలవరంపై వందల కోట్లు సొంతంగా ఖర్చుపెట్టడం సాధ్యంకాని అంశమని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications