సైకిల్ దూకుడును నారా లోకేష్ పెంచుతాడా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో యువరక్తాన్ని ఉరకలెత్తించడానికి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ నడుం బిగించారు. వచ్చే ఎన్నికల్లో యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఆ కసరత్తను తనయుడు లోకేష్‌కు ఆయన అప్పగించినట్లున్నారు. యువతను పార్టీ వైపు ప్రోత్సహించే బాధ్యతలను చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తీసుకున్నారు. గత ఆరు నెలల నుంచి ఎన్టీఆర్ భవన్‌లో రాష్ట్ర వ్యాప్తంగాఉన్న వివిధ వర్గాలకు చెందిన యువత, విద్యార్థులతో లోకేష్ నిత్యం చర్చలు, సమాలోచనలు జరుపుతున్నారు.
వారిని పార్టీపరంగా చైతన్యం చేసి గ్రామాలకు పంపితే ఎన్నికల్లో మంచి ఫలితాలు ఉంటాయనేది పార్టీ ఆలోచన. అందుకే యువతకు ఉద్యోగాలు రావాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావటం ఒక్కటే మార్గమని వారికి బోధిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా హైటెక్ సిటీని నిర్మించటంవల్లనే ఈనాడు లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని తెలుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పది సంవత్సరాలు లక్షలాదిమంది యువతకు ఉద్యోగాలు లేకుండా పోయాయని, మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎంబిఎ, ఎంసిఎ, బికెట్ వంటి వృత్తిపరమైన కోర్సులు పూర్తి చేసుకున్న యువత కోసం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలాగా తిరుపతి, విశాఖపట్నంలలో ఐటీ పార్కులు నిర్మించి, ఉద్యోగ అవకాశాలు కల్పించటం జరిగిందని యువతలో ప్రచారం చేయనున్నారు.

అదేవిధంగా బెంగుళూరు, చైన్నైలకు పారిశ్రామిక కారిడార్‌ను నిర్మించటానికి తమ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు తయారు చేసిందని తెలుపుతున్నారు. దీనితో పాటు 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువ, యువకులను ఓటర్ లిస్టులో పేర్లు నమోదు చేసే కార్యక్రమాల్లో కూడా తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. కొత్తగా ఓటు హక్కు పొందిన యువతను తమ పార్టీవైపు మళ్ళించే విధంగా లోకేష్ తగిన సూచనలు, చర్యలు తీసుకుంటున్నారు.
పార్టీని విజయ పథాన నడిపించడానికి పార్టీకి సేవ చేసిన నాయకులు కుమారులకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని లోకేష్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రతి గ్రామానికి ఇద్దరు విద్యావంతులైన యువతను ఎంపిక చేసి ఎన్టీర్ భవన్‌లో లోకేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వీరు తమతమ గ్రామాల్లోకి వెళ్ళి రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవస్యకతను గురించి బలహీన వర్గాల ప్రజలకు వివరించటంతో పాటు, గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా వారి పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో వారు ఎన్ని విధాలుగా కష్టాలు పడుతున్నారనే విషయాలను తెలియ చేసి, వారిని చైతన్యవంతం చేస్తారని అంటున్నారు.
అదే విధంగా ఆయా గ్రామాల్లో వివిధ పార్టీల ఎత్తుగడలు, ప్రచారసరళి, వాళ్ళు ప్రజలకు చేసే వాగ్ధానాలు, ఏ వర్గం ప్రజలు ఆ పార్టీలవైపు మొగ్గు చూపుతున్నారు, తదితర విషయాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి తెలియచేసే పనిని లోకేష్ యువతకు అప్పగించినట్లు సమాచారం. దీన్నిబట్టి ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసే విధంగా, తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళి వారిని పార్టీ వైపు మళ్ళించే అవకాశం ఉంటుందని చంద్రబాబు, లోకేష్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications