ఒక్కటయ్యారు: జూ. ఎన్టీఆర్ కారు తోలారు

టిడిపి వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు కుటుంబానికి చెందిన దాదాపు 150 మంది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఎన్టీ రామారావు ఏడుగురు కుమారులు, నలుగురు కూతుళ్లు, వారి కొడుకులూ కూతుళ్లూ, మనవలు, మనవరాళ్లు.. మొత్తం 150 మంది ఆదివారం గన్నవరం విమానాశ్రయంలో దిగుతుంటే ఒక్కటే సందడి.
నందమూరి కుటుంబ సభ్యులు బాలకృష్ణ, హరికృష్ణ, రామకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒక్కరొక్కరే విమానం దిగుతుంటే చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఆహ్వానం పలికారు. లోకేష్ వారిని పేరు పేరునా పలకరిస్తూ అక్కడి నుంచి మూడు కార్లు, మూడు వోల్వో బస్సుల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తరలిపోయారు. ఓ కారును జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా నడిపించారు. సభా ప్రాంగణం వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా కనిపించారు.
కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ పక్కపక్కనే కూర్చున్నారు. హరికృష్ణ కుటుంబ సభ్యులు సభా ప్రాంగణంలో మరింత ప్రత్యేకంగా కనిపించారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో హరికృష్ణ ఎక్కువసేపు నిలబడలేక కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ భుజాలపై చేతులు వేసి ఆసరా తీసుకున్నారు. వారు వచ్చిన వారిని పలకరిస్తూ సరదాగా కనిపించారు.












Click it and Unblock the Notifications