పవన్ కళ్యాణ్ షరతులు: బళ్లారి అంటే వెనక్కే..
హైదరాబాద్: ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడమే కాదు, ఇప్పుడు ప్రచారానికి కూడా దిగుతున్నారు. అయితే, బిజెపి తరఫున ప్రచారం చేయడానికి ఆయన కొన్ని షరతులు పెట్టారని వినిపిస్తోంది. తన షరతులకు సమ్మతిస్తేనే ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తానని బిజెపి నేతలకు ఆయన తేల్చి చెప్పారు. ఆ పార్టీ వాటికి ఆమోదం తెలపడంతో మంగళవారం ఆయన కర్ణాటక రాష్ట్రంలో ఆ పార్టీ తరపున ప్రచారానికి వెళ్లనున్నారు.
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తాను మోడీకి మద్దతు ఇచ్చాను తప్ప తాను బిజెపి మనిషిని కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసినట్లు సమాచారం. తాను బిజెపి తరపున ప్రచారం చేయాలంటే తనవి కొన్ని షరతులు ఉన్నాయని, బిజెపి అధికారంలోకి వస్తే మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా పని చేయాలని ఆయన అన్నట్లు సమాచారం. అంతేకాకుండా, బిజెపి నేతలపై కర్ణాటకలో వచ్చిన అవినీతి ఆరోపణలపై కూడా పవన్ కళ్యాణ్ నిక్కచ్చిగా మాట్లాడినట్లు చెబుతున్నారు.

కర్ణాటకలో బిజెపి నేతలు కొందరిపై అవినీతి ఆరోపణలున్నాయని, ప్రత్యేకించి బళ్ళారి జిల్లాలో ఉన్న నేతలపై చాలా ఉన్నాయని, అక్కడ తెలుగువారు అధికంగా ఉన్నారని తనను అక్కడకు వెళ్లి వారి తరఫున ప్రచారం చేయాలని చెప్పొద్దని ఆయన చెప్పినట్లు సమాచారం. అలా అయితేనే తాను ప్రచారంలోకి దిగుతానని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
బిజెపి నేతలు పవన్ కళ్యాణ్‌తో జరిగిన భేటీ నుంచే పార్టీ జాతీయ నాయకులతో, మోడీతో మాట్లాడారని, అవి తమకు సమ్మతమేనని వారు చెప్పారని అంటున్నారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న గుల్బర్గా, రాయచూరు, కోలార్‌ల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు. మరోవైపు.. సీమాంధ్రలో టీడీపీ టికెట్ పొందిన కొందరు అభ్యర్థులు సోమవారం పవన్ కల్యాణ్‌ను కలిసి తమ తరపున ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.
లోకసత్తా అభ్యర్థుల కోసం కూడా..
జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ రాష్ట్రంలో లోక్‌సత్తా తరఫున ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సత్తా పార్టీ అగ్రనేతల వినతిపై ఆయన ఇంకా స్పందించకపోయినా, సానుకూలంగా ఉన్నట్లు లోక్‌సత్తా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications