చూద్దాం, ఏం జరుగుతోంది: రంగంలోకి పవన్ కళ్యాణ్, కానీ?
విజయవాడ: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బయటకు రాకపోవడంపై, కనీసం స్పందించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఆయన మాత్రం ఎప్పటికప్పుడు కాపు నేతలతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు.
ముద్రగడ దీక్ష మంగళవారం నాటికి ఆరో రోజుకు చేరుకుంది. గంటగంటకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. తుని విధ్వంసం పేరిట అరెస్టు చేసిన కాపు యువకులను తక్షణమే విడుదల చేయడంతో పాటు కాపులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన ఇంటిలో ఆయన ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే.
అయితే నాటకీయ పరిణామాల మధ్య ముద్రగడ దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నారు. కేవలం నీరు మినహా ఆయన ఏమీ ముట్టడం లేదు. దీంతో ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తదితర కాపు నాయకులు బయటకు రాకపోవడంపై కాపులలో ఆగ్రహం వ్యక్తమవుతోందనే వాదనలు వినిపించాయి. విపక్షాలు పవన్ కళ్యాణ్‌ను ప్రశ్నిస్తున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే బయటకు రాకపోవడం విడ్డూరమని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే మూడు రోజుల క్రితం చిరంజీవి సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. సోమవారం నాడు దాసరి నారాయణ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. అంతకుముందు కాపు నేతలతో చర్చించారు. అయితే, పవన్ కళ్యాణ్ బయటకు రాకపోయినప్పటికీ తన పని తాను చేస్తున్నారని అంటున్నారు.

కాపు రిజర్వేషన్ల పైన చంద్రబాబు ఇచ్చిన హామీని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ విషయమై, ముద్రగడ దీక్ష... తదితర అంశాల గురించి కాపు నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.
కాపు నేతలతో, అలాగే, కాపు మంత్రులతో పవన్ నిత్యం టచ్‌లో ఉన్నారనే ప్రచారం సాగుతోంది. ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఇప్పటికే, చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో కలిపేయడాన్ని కాపులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎదురు కావొద్దని జనసేన భావిస్తోందంటున్నారు. పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగేస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి వేడిగా ఉన్నప్పటికీ.. ఇది సరైన సమయం కాదని ఆయన భావించడం వల్లే బయటకు రావడం లేదు కావొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చేందుకు ముందుకు రావడం, కమిషన్ వేయడం చేసింది కాబట్టి.. గడువు తీరిన తర్వాత పవన్ కళ్యాణ్ దానిని గట్టిగా ప్రశ్నించే ఆస్కారం ఉందని అంటున్నారు. మొత్తానికి కాపు ఇష్యూ పైన పవన్ బయటకు రాకున్నప్పటికీ, పరిస్థితులు తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. రిజర్వేషన్ల ప్రక్రియ నెమ్మదిస్తే అప్పుడు పవన్ బయటకు రావొచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications