వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ స్పెషల్: రాహుల్‌ రాజగురువుగా ప్రణబ్ దాదా

వాకింగ్ లైబ్రరీగా భావించే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. తన రాజకీయ అనుభవాన్ని రంగరించి యువ నేత రాహుల్ గాంధీకి మార్గదర్శి కానున్నారు. 1970వ దశకంలో బెంగాల్‌లో ఒక ఉప ఎన్నికలో క్రుష్ణమీనన్ తరఫున ప్రచారం

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇప్పటివరకు భారత రాజ్యాంగం 101 సార్లు సవరణకు గురైంది. ఆ సవరణలకు కారణాలేమిటో సాధారణ వ్యక్తులకే కాదు కొందరు పార్లమెంట్ సభ్యులకూ తెలియదు. కానీ ప్రతి సవరణకు కారణాలు.. దానిపై పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులేం మాట్లాడారో పూర్తి వివరాలు సోదాహరణంగా చెప్పగల దిట్ట ఉన్నారు. ఆయనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఒక వాకింగ్ లైబ్రరీ. 1969లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైనప్పటి నుంచి ఇందిరా గాంధీ.. రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ సారథ్యంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కీలక భూమిక వహించారు. కాంగ్రెస్ పార్టీలో ఒడిదొడుకులను, అవాంతరాలను, సమస్యలను అతి దగ్గర నుంచి చూసిన నేపథ్యం ఆయనది.

ప్రతి చట్ట రూపకల్పనలోనూ సభ్యులెవరికీ తెలియని విషయాలను చెప్పి మరీ అక్షింతలు వేసేవారు. అంతటి ప్రతిభావంతుడైనందు వల్లే పార్లమెంటులో ఒక మంత్రిగా ప్రణబ్‌ ముఖర్జీ గతంలో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టారంటే దానిపై ప్రతిపక్షాలు కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పేవి కావు. అంతటి అపార రాజకీయ అనుభవం ఉన్న ప్రణబ్‌.. మాజీ రాష్ట్రపతిగా కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కు కాబోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అనధికారిక మార్గదర్శిగా, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాజ గురువుగా వ్యవహరించనున్న ప్రణబ్‌ ముఖర్జీ స్టయిలే వేరు.

కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిలా ఇలా ప్రణబ్

కాంగ్రెస్ పార్టీకి దిక్సూచిలా ఇలా ప్రణబ్

సాధారణంగా రాష్ట్రపతులు పదవీ విరమణ చేశాక ఏ రాజకీయ పార్టీకీ అనుబంధంగా ఉండరు. 1998లో మధ్యంతర ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఎన్డీయే ప్రధాని అభ్యర్థి అటల్ బీహారీ వాజ్‌పేయి.. యూపీలో కల్యాణ్ సింగ్ వర్సెస్ జగదంబికా పాల్ మధ్య విశ్వాస పరీక్ష నెగ్గే వరకు లక్నోలో నిర్వహించిన నిరవధిక నిరాహార దీక్షకు మాజీ రాష్ట్రతి వెంకట్రామన్ హాజరై మద్దతు తెలిపారు. గమ్మత్తేమిటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఆయన్ను రాష్ట్రపతిని చేసింది. కానీ, ప్రణబ్‌ ముఖర్జీ కాస్త భిన్నంగా వ్యవహరించనున్నారు. తనను ఇంత స్థాయికి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీని అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేసేందుకు ముందుకొచ్చారు. దీంతో ‘దటీజ్‌ ప్రణబ్‌.. రాజకీయాలే ఆయన ఊపిరి. రాజకీయాలకు దూరంగా ఉండలేరు' అని ప్రణబ్‌ సన్నిహితులు అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ప్రణబ్‌ మార్గదర్శిగా వస్తున్నారని వార్తలొచ్చిన నేపథ్యంలో మాజీ రాష్ట్రపతి ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండవచ్చా? దీనిపై రాజ్యాంగం ఏమైనా స్పష్టత ఇచ్చిందా? అన్న కోణాల్లో ఆయా వర్గాల్లో విశ్లేషణలు సాగాయి. వాస్తవంగా మాజీ రాష్ట్రపతులు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ రాజకీయాల్లోకి రాకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. కానీ, సాధారణంగా చాలామంది రాష్ట్రపతులు శేష జీవితాన్ని రాజకీయాలకు దూరంగా గడుపుతుంటారు. దేశంలో రాష్ట్రపతి పదవి కంటే పెద్దది లేదు. పైగా మాజీ రాష్ట్రపతికి ఉండే ప్రొటోకాల్‌ కూడా తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో ప్రణబ్‌ కూడా కాంగ్రెస్‌ పార్టీకి దిక్చూచిగా ఉంటారే తప్ప.. ఆ పార్టీ సభ్యత్వం తీసుకోబోరని, సమావేశాల్లో పాల్గొనబోరని సమాచారం. పార్టీపై ఉన్న మమకారం, రాజ్యాంగపరంగా చిక్కులు లేకపోవడంతో ప్రణబ్‌ సొంత నిర్ణయం తీసుకున్నారని ఓ నేత వ్యాఖ్యానించారు.

సోనియా, మన్మోహన్ వాదనలతో ఏకీభావం

సోనియా, మన్మోహన్ వాదనలతో ఏకీభావం

రాజకీయ చాణక్యుడైన ప్రణబ్‌ కాంగ్రెస్‌ మార్గదర్శిగా కొత్త పాత్రను పోషిస్తారని ఆ పార్టీ అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా ప్రణబ్‌తో పదేపదే భేటీ అయిన సోనియా, మన్మోహన్‌ సింగ్ ఆయనను కాంగ్రెస్‌కు మార్గదర్శిగా వ్యవహరించేలా ఒప్పించడంలో సఫలీకృతం అయ్యారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సోనియా గాంధీకి రాష్ట్రపతి భవన్‌ నుంచే సలహాలు, సూచనలు ఇచ్చిన ప్రణబ్‌ ఇక కింగ్‌ మేకర్‌ పాత్రను పోషించడానికి సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రపతి భవన్‌ను ఖాళీ చేసిన తరువాత 8, రాజాజీ మార్గ్‌లో బస చేస్తున్న ప్రణబ్‌ నివాసంలో రోజురోజుకీ కాంగ్రెస్‌ నేతల తాకిడి ఎక్కువవుతున్నది. 2019 ఎన్నికల్లో మోదీకి దీటుగా రాహుల్‌ను తీర్చిదిద్దడంలో ప్రణబ్‌ తన వంతు పాత్ర పోషిస్తారని, ఆయన తన అపార రాజకీయ అనుభవంతో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సోనియా నమ్ముతున్నారు. ప్రణబ్‌ కాంగ్రెస్‌ మార్గదర్శి బాధ్యతలను చేపట్టడం ఖాయం అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి కనిపిస్తోంది. ప్రణబ్‌ ఆత్మకథ మూడో పుస్తకం (సంకీర్ణ సంవత్సరాలు 1996-2012) రెండు రోజుల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీయేతర పార్టీల నేతలను మాత్రమే ఆహ్వానించడం ద్వారా ఇక ఆ పార్టీపై కాంగ్రెస్‌ తరపున ప్రణబ్‌ యుద్ధాన్ని ప్రకటించినట్లేనని రాజకీయ ఉద్దండులు చెబుతున్నారు. ప్రణబ్‌ తన పుస్తకావిష్కరణ నేపథ్యంలో ఒక ఆంగ్ల వార పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ కాంగ్రెస్ పార్టీని ప్రణబ్‌ వెనకేసుకొచ్చారు. 132 ఏళ్ల కాంగ్రెస్‌ పార్టీని తక్కువగా అంచనా వేయకూడదని, తప్పకుండా మళ్లీ లేచి నిలబడుతుందని నొక్కి వక్కాణించారు. ‘ప్రజలను భయపెట్టకూడదు' అని పెద్ద నోట్ల రద్దుపై వ్యాఖ్యానించారు. ‘జీఎస్టీని మొదట నేనే ప్రతిపాదించాను. దాని అమలులో కొన్ని బాలారిష్టాలు ఉండవచ్చు. మొత్తానికి జీఎస్టీ మంచిదే' అని ప్రణబ్‌ తెలిపారు.

క్షేత్రస్థాయి నేతల తప్పుడు నివేదికలిలా

క్షేత్రస్థాయి నేతల తప్పుడు నివేదికలిలా

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరంగా ఓడిపోవడానికి గల కారణాలనూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ తనదైన శైలిలో విశ్లేషించారు. ‘యూపీఏ-1ను చాలా బాగా నడిపించాం. భాగస్వామ్య పక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయి. యూపీఏ-2 విషయంలో అలా జరగలేదు. సంకీర్ణ పాలన సరిగ్గా సాగలేదు. కాంగ్రెస్‌ ఎప్పుడూ 200 సీట్లు గెలిస్తే చాలు. అవే 280 సీట్లకు సమానమని, మిగతా పక్షాలు తమకే మద్దతు ఇస్తాయనుకునేది. అందుకే కాంగ్రెస్‌ పార్టీ పతనం అంచున నిలబడింది. 2012లో మమతా బెనర్జీ యూపీఏ నుంచి బయటకు వెళ్లిపోవడం కూడా మరో కారణం. మమతతో వ్యవహారం కష్టమే. అందులో ఎటువంటి సందేహం లేదు. అయినా ఆమె వద్ద 19 మంది ఎంపీలున్నారని ఎంతకష్టమైనా ఆమెను వదులుకోకుండా ఉండాల్సిందని ప్రణబ్‌ తెలిపారు. ‘కింది స్థాయి నుంచి కాంగ్రెస్‌ నేతలు పంపిన తప్పుడు నివేదికలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించాయి. పరిస్థితులు చేయిదాటి పోయేలా ఉన్నాయని మన్మోహన్‌, సోనియా చెబుతూనే ఉన్నా నన్ను కలిసిన కొంతమంది కాంగ్రెస్‌ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి 160-170 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 180 వరకూ వస్తాయని అంచనా వేశారు' అని గుర్తు చేసుకున్నారు.

Recommended Video

గుజరాత్‌లో బీజేపీకి ఎదురుగాలి? సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం? | Oneindia Telugu
పాఠాలు బోధిస్తూనే అనంతలోకాలకు కలాం

పాఠాలు బోధిస్తూనే అనంతలోకాలకు కలాం

ప్రణబ్‌ కంటే ముందు రాష్ట్రపతిగా పనిచేసిన 12 మంది.. పదవీ విరమణ చేసిన తర్వాత ఏ పార్టీతోనూ రాజకీయ అనుబంధం పెట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి పదవీ విరమణ తర్వాత.. ఆయన వద్ద సలహాలు, సూచనలు తీసుకోవచ్చని అప్పటి కర్ణాటక సీఎం రామకృష్ణ హెగ్డే భావించారు. ఆయనను శేష జీవితాన్ని బెంగళూరులో గడపాలని కోరారు. కానీ, దానిని సంజీవరెడ్డి సున్నితంగా తిరస్కరించి అనంతపురం జిల్లాలోని తన సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించారు. అబ్దుల్‌ కలాం పదవీ విరమణ తర్వాత వివిధ యూనివర్సిటీలకు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పని చేశారు. ఆ క్రమంలో ఓ యూవనివర్సిటీలో విద్యార్థులకు బోధిస్తూనే.. కుప్పకూలిపోయి తుది శ్వాస విడిచారు. ప్రతిభా పాటిల్‌ పదవీ విరమణ తర్వాత తన సొంత ఊరికి వెళ్లిపోయారు. మిగతా వారిలో ఎవరికీ ఎక్కువగా రాజకీయ అనుభవం లేకపోవడంతో పార్టీలకు దూరంగా గడిపారు.

పూర్వ వృత్తి చేపట్టిన ప్రముఖులు

పూర్వ వృత్తి చేపట్టిన ప్రముఖులు

మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధాన మంత్రులు తమ పదవీ విరమణ తర్వాత రాజకీయ పార్టీలో ఉండొద్దని ఇతర దేశాల్లో కూడా నిబంధనలేమీ లేవు. చాలా దేశాల్లో దేశాధ్యక్షులు, ప్రధానులు తమ పదవి పూర్తయిన తర్వాత.. తమ పూర్వ వృత్తిని చేపట్టడానికి సంకోచించరు. అలా చాలా మంది బోధనా వృత్తి నుంచి వచ్చి తిరిగి మళ్లీ అదే వృత్తిలోకి వెళ్లారు. ఇక రాజకీయంగా చూస్తే.. అమెరికా ఆరవ అధ్యక్షుడు జాన్‌ క్విన్సీ ఆడమ్స్‌ అధ్యక్ష పదవి పూర్తయిన తర్వాత దాదాపు 17 ఏళ్లపాటు మెసాచెసెట్స్‌ స్టేట్‌ నుంచి హౌజ్‌ ఆఫ్‌ రెప్రజెంటేటివ్స్‌లో ప్రాతినిధ్యం వహించారు. 17వ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ అధ్యక్ష పదవి తర్వాత కూడా తన్నెస్సే రాష్ట్రం నుంచి సెనెట్‌కు ఎన్నికయ్యారు. 27వ అధ్యక్షుడు విలియమ్‌ హోవర్డ్‌ టఫ్ట్‌ పదవీ విరమణ తర్వాత ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఫ్రెంచ్‌ అధ్యక్షుడిగా పనిచేసిన నికోలస్‌ సర్కోజీ ఆ తర్వాత ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు.

English summary
The high profile release of Pranab Mukherjee’s new book, the first after he demitted office as the 13th President of the Republic, in the presence of the Congress chief Sonia Gandhi, former Prime Minister Manmohan Singh and several erstwhile and present allies of the UPA, has triggered speculation regarding his possible return to the political arena. Significantly, none of the NDA leaders, with whom Mukherjee enjoyed a warm and close personal relationship, were invited for the function held at the Teen Murti auditorium, to reiterate the ideological dimension of the exercise. The event was used deftly by Sonia Gandhi to declare from the sidelines that Rahul would soon be taking over from her, thereby putting to rest conjectures in relation to her son’s future, as well as sending a signal to the former President that the party was now going to go ahead in choosing its new leader and saw in him a former associate whose contributions would always be treasured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X