జగన్‌కు వత్తాసు కలకలం, కెసిఆర్‌పై అనుమానాలు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు రెండు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే గెలుస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవుతారన్న కెసిఆర్ వ్యాఖ్యల పైన తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ పార్టీల నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో తాను, సీమాంధ్రలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని కెసిఆర్ చెప్పడం వెనుక అర్థమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెసు, టిడిపి నేతలు కెసిఆర్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారం సమయంలోను కెసిఆర్ కాంగ్రెసు, టిడిపిల పైన విమర్శలు గుప్పించారు కానీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన విమర్శలు చేయలేదని, అందుకు వారిద్దరి మధ్య ఫిక్సింగే కారణమని ఆరోపిస్తున్నారు.

కాంగ్రెసు పార్టీ నేతలు శ్రవణ్ కుమార్, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య, తెలుగుదేశం పార్టీ నేతలు రాజేంద్ర ప్రసాద్ వంటి నాయకులు కెసిఆర్ పైన ఘాటైన విమర్శలు చేశారు. జగన్‌తో అవగాహన ఉన్నందువల్లే పోలింగ్‌కు ముందు ఆయన పైన విమర్శలు చేయలేదని, ఇప్పుడు జగనే సిఎం అవుతారని కెసిఆర్ అంటున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణలో తెరాస ప్రచారానికి జగన్ మెతుకులు వేశారా అని ప్రశ్నించారు.
జగన్ దోపిడీలో కెసిఆర్ వాటా ఎంత అని శ్రవణ్ కుమార్ ఘాటుగా ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగులో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి వచ్చిన, తెలంగాణ ద్రోహులైన వారికి టిక్కెట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. కొండా సురేఖ, బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వంటి వారికి టిక్కెట్లు ఇవ్వడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. జగన్‌కు కెసిఆర్ ప్రతినిధిలా మాట్లాడటం వెనుక అర్థమేమిటని పొన్నాల ప్రశ్నించారు. కెసిఆర్ విభజనవాదానికి పరోక్షంగా జగన్ మద్దతు పలికారని కూడా ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications