తప్పుడు వ్యూహం: దిక్కు లేని తెలంగాణ టిడిపి
హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా కింద జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఢిలీ పడింది. ఆ పార్టీ వ్యూహం బెడిసి కొట్టింది. కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుని కనీసం ఒక్క ఎమ్మెల్సీ స్తానమైనా గెలుచుకున్న శాసనమండలిలో అడుగు పెట్టాలనే ఆ పార్టీ వ్యూహం దెబ్బ తిన్నది. టిడిపితో పొత్తుకు కాంగ్రెసు పార్టీ సిద్ధంగా లేదు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇటీవల చర్చలు కూడా జరిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలో లేదా రంగా రెడ్డి జిల్లాలో ఒక్క స్థానం తమకు కేటాయించాలని ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రతిగా కాంగ్రెసుకు మిగతా చోట్ల మద్దతు ఇస్తామని చెప్పారు.
అయితే, టిడిపితో పొత్తుకు జిల్లా కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు విముఖత ప్రదర్శించారు. దీంతో కాంగ్రెసు రాష్ట్ర నాయకత్వం టిడిపితో పొత్తుపై వెనక్కి తగ్గింది. దీంతో టిడిపికి దిక్కూ మొక్కూ లేకుండా పోయింది. కాంగ్రెసుతో పొత్తు ఖరారు కాకపోవడంతో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా 7 స్థానాలకు పోటీ చేస్తామని టిడిపి ప్రకటించింది. కానీ అభ్యర్థులు దొరకని పరిస్థితి. చివరకు ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం జిల్లాలో సిపిఐ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. నామినేషన్ల దాఖలుకు బుధవారమే చివరి రోజు.

ఈ పరిస్థితిలో వరంగల్‌లో తాము ఎంపిటీసిల ఫోరం నేతకు మద్దతు ఇస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ప్రభుత్వానికి, మిగతా పార్టీలకు వ్యతిరేకంగా నామినేషన్లు వేయాలని ఎంపిటీసిల ఫోరం నిర్ణయం తీసుకుంది. దీంతో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కూడా చిక్కుల్లో పడింది. వరంగల్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెసు, టిడిపి, బిజెపి పోటీకి చేతులెత్తేశాయి. నామినేషన్ వేసిన ముగ్గురిని టిఆర్ఎస్ బుజ్జగిస్తోంది.
కాగా, కాంగ్రెసు పార్టీ 8 స్థానాలకు పోటీ పడుతోంది. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో సిపిఐ అభ్యర్థికి మద్దతు ఇస్తోంది. టిడిపి మాత్రం దిక్కు తోచని స్థితిలోనే ఉంది. రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం, సయోధ్య లేకపోవడం టిడిపికి శాపంగా మారింది.












Click it and Unblock the Notifications