'లోకేష్' చేయి: చంద్రబాబుపై ఈ సీనియర్లు అలక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో తమకు చోటు దక్కక పోవడంపై పలువురు సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. బాబు కేబినెట్లో మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలకు పలువురికి చోటు దక్కింది. పలువురు సీనియర్లకు బాబు మొండి చేయి చూపించారు. దీంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.
కేబినెట్లో చోటు దక్కకపోవడంపై అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు ఓ సందర్భంలో రాజీనామా చేయాలని కూడా భావించారట. ఆ తర్వాత వెనక్కి తగ్గారని సమాచారం. విశాఖకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి అసంతృప్తితో సోమవారం పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.

గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కోడెల శివప్రసాద రావు, దూళిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాల్ రెడ్డిలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మోదుగుల, దూళిపాళ్ల వర్గీయులు ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కృష్ణా జిల్లా సీనియర్ నేత కాగితపు వెంకట్రావు.. తనకు కేబినెట్లో చోటు దక్కలేదనే విషయం తెలియగానే అస్వస్థతకు గురయ్యారట. ఇది తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైద్యుడితో మాట్లాడారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కిమిటి కళా వెంకట్రావులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
తూర్పు గోదావరి జిల్లా ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, గొల్లపల్లి సూర్యారావులు కూడా తీవ్ర అసహనంతో ఉన్నారు. అనంతపురం పెనుగొండ ఎమ్మెల్యే బికె పార్థసారథి అనుచరులు పలువురు టిడిపికి రాజీనామా చేశారు. కాగితపు వెంకట్రావు అనుచరులతో పాటు పలువురు జెడ్పీటీసీ, ఎంపీటీసీలు సోమవారం సమావేశమయ్యారు. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడుకు దక్కింది. కిమిడి కళా వెంకట్రావు, లక్ష్మీదేవిలకు దక్కలేదు. వారు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. కాగా, చంద్రబాబు కేబినెట్ కూర్పులో నారా లోకేష్ చేయి ఉన్నదని సమాచారం.












Click it and Unblock the Notifications