కార్మికులకు 'మేడే' కానుక. సీఎం ప్రకటించిన భారీ వరాలివే!
రాష్ట్రంలో ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడటమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం మేడే సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో నిర్వహించిన 'పేదల సేవలో' కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం.. గత పాలకుల విధ్వంసకర పాలనలో రెండేళ్ల క్రితం వరకు ప్రజల్లో నవ్వు లేదన్నారు. ఆ అంధకారం నుంచి ప్రజలకు మరోసారి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానిదేనని కొనియాడురు. ఈ సందర్భంగా ఉత్తమ కార్మికులకు 'శ్రమ శక్తి' పురస్కారాలను అందజేసి, లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లను పంపిణీ చేశారు.
కార్మికుల కష్టాలను గుర్తించి వారి సంక్షేమం కోసం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి ప్రకటించారు. "ఎండనక, వాననక కష్టపడే కార్మికుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 15 చోట్ల అత్యాధునిక వసతులతో 'లేబర్ అడ్డా'లను ఏర్పాటు చేస్తున్నాం. ఇవి కేవలం షెల్టర్లు మాత్రమే కాదు, కార్మికుల్లో నైపుణ్యం పెంచే స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలుగా మారుతాయి. కార్మికుడి బిడ్డ కూడా పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదగాలి. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. నిర్మాణ రంగ కార్మికుల వివాహాలకు రూ.25 వేలు, ప్రసవ సాయం కింద రూ.20 వేలు అందిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నాం" అని ఆయన వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 88 లక్షల మంది అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రూ.615 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు.

22 నెలల్లో రూ.63 వేల కోట్ల పింఛన్లు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఒక ట్రెండ్ కాదని, అది పేదల పట్ల తమకున్న బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రూ.33 వేల కోట్లు కేవలం పింఛన్ల కోసమే ఖర్చు చేస్తున్నామన్నారు. గత 22 నెలల్లో రూ.63 వేల కోట్లకు పైగా నిధులను 62.47 లక్షల మంది లబ్ధిదారులకు అందించామని వివరించారు. ప్రతీ నెలా ఒకటో తేదీ రాగానే పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, అన్న క్యాంటీన్ల ద్వారా కార్మికులు, కూలీలకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని పునరుద్ఘాటించారు. తల్లికి వందనం, దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలతో మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నాం అని ఆయన వివరించారు.
డిసెంబర్ నాటికి బందరు పోర్టు పూర్తి
కృష్ణా జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
"విశాఖ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందే జిల్లా కృష్ణా. బందరు పోర్టు పనులు ప్రస్తుతం 57 శాతం పూర్తయ్యాయి. డిసెంబర్ నాటికి పోర్టును పూర్తి చేసి తీరుతాం. భారత్ మాలా ప్రాజెక్టు కింద రూ.574 కోట్లతో రోడ్ల విస్తరణ జరుగుతోంది. విజయవాడ - మచిలీపట్నం మధ్య 6 లేన్ల రోడ్డు, హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు ఎక్స్‌ప్రెస్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. గూగుల్ రూ.1.35 లక్షల కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తోంది, రిలయన్స్ కూడా భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. అమరావతి రైతుల త్యాగంతో రాజధాని నిర్మాణం మళ్లీ గాడిన పడింది"- సీఎం చంద్రబాబు.
'గొడ్డలి' పార్టీని నమ్మకండి.. విధ్వంసానికి చరమగీతం పాడాలి
గత ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతూ.. "రాష్ట్రంలో ఉన్నది కోడి కత్తి పార్టీ.. అది ఒక నేర ప్రవృత్తి కలిగిన పార్టీ. అధికారంలోకి రాగానే ప్రజావేదికను కూల్చి విధ్వంసం మొదలుపెట్టారు. పోలవరం డయాఫ్రాం వాల్ కొట్టుకుపోవడానికి గత పాలకుల నిర్లక్ష్యమే కారణం. వివేకా హత్య కేసులో నాటకాలు ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ప్రజలు నమ్మి 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని స్మశానంగా మార్చారు. మళ్లీ ఇప్పుడు విధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి శక్తులను రాజకీయాల నుంచి దూరం పెట్టాలి" అని పిలుపునిచ్చారు.
"ప్రజలతోనే నాకు కమిట్మెంట్.. ఎమ్మెల్యేల పనితీరును నేరుగా మీ ద్వారానే తెలుసుకుంటాను. తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్‌గా ఉండటమే నా లక్ష్యం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications