ఏపీ ప్రజలకు శుభవార్త.. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి బాలకృష్ణ శంకుస్థాపన!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తుళ్లూరు సమీపంలో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులను హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోని అగ్రశ్రేణి క్యాన్సర్ ఆసుపత్రులలో ఒకటిగా హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 2023లో రెండవ స్థానం సాధించి గుర్తింపు పొందింది. లక్షలాది రోగులకు చికిత్స అందించి, క్యాన్సర్ పరిశోధనలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తోంది.
రూ.750 కోట్లతో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం
ఇప్పుడు అమరావతిలో కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం రూ.750 కోట్లతో జరుగుతోంది. ఇది 500 పడకలతో జరుగుతోంది. ఇది NTR కుటుంబం యొక్క సేవా తత్పరతకు మరో సాక్ష్యం. ఈ అత్యాధునిక క్యాన్సర్ ఆసుపత్రికి ఏపీ ప్రభుత్వం 21 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అధునాతన వైద్య పరికరాలు, ప్రెసిషన్ డయాగ్నోస్టిక్స్, అడ్వాన్స్‌డ్ సర్జికల్ టెక్నాలజీలు అందుబాటులో ఉంటాయి.

సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి
రెండో దశలో మరో 500 పడకలు జోడించి, మొత్తం 1,000 పడకల సామర్థ్యంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ఆసుపత్రి నిర్మాణం కోసం అవసరమైన అన్ని ప్రభుత్వ అనుమతులు, నిబంధనలు పూర్తి చేసిన తర్వాతే పనులు ప్రారంభించాం అని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో అత్యున్నత వైద్య సేవల కోసం ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారని, ఈ ఆసుపత్రి ఆ ఆకాంక్షను నెరవేర్చనుందని అన్నారు.
ఈ ఏడాది జూన్ 22న భారీ వేడుకలు
హైదరాబాద్‌లో బసవతారకం ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 22న భారీ వేడుకలు నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తాం అని బాలకృష్ణ వెల్లడించారు. ఈ క్యాన్సర్ ఆసుపత్రి అమరావతి అభివృద్ధిలో మరో మైలురాయి అని, పేదలు, మధ్య తరగతి వారికి నాణ్యమైన క్యాన్సర్ చికిత్స అందించడంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని అత్యుత్తమ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలలో ఒకటి
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌లోని అత్యుత్తమ క్యాన్సర్ చికిత్సా కేంద్రాలలో ఒకటి. ఇది 1985లో క్యాన్సర్ వ్యాధితో మరణించిన నందమూరి బసవతారకం గారి స్మృతి అర్థం చేసుకుని, ఆమె భర్త ఎన్టీఆర్ స్థాపించారు. NTR తన భార్య మరణం తర్వాత క్యాన్సర్ రోగులకు అత్యాధునిక చికిత్సలు అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో నందమూరి బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ స్థాపించారు.
110 పడకలతో మొదలై నేడు 650 పడకల సామర్థ్యంతో
1986లో హైదరాబాద్‌లో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అమెరికాలోని ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది.
జూన్ 22, 2000న తదితర ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఈ ఆసుపత్రిని అధికారికంగా ప్రారంభించారు. ప్రారంభంలో 110 పడకలతో మొదలైన ఈ ఆసుపత్రి, నేడు 650 పడకల సామర్థ్యంతో విస్తరించింది.
ఆసుపత్రి ఛైర్మన్ గా నందమూరి బాలకృష్ణ సేవలు
అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన చికిత్సలు, రేడియేషన్ థెరపీ, సర్జరీ, మెడికల్ ఆంకాలజీ, రీసెర్చ్ సదుపాయాలు అందిస్తోంది.ప్రస్తుతం ఆసుపత్రి ఛైర్మన్ గా నందమూరి బాలకృష్ణ సేవలు అందిస్తున్నారు. ఆయన తల్లిదండ్రుల కలను ముందుకు తీసుకెళ్తూ, క్యాన్సర్ చికిత్సను అందుబాటులో ఉంచేలా, నాణ్యమైనదిగా అందించడంపై దృష్టి సారించారు.2025లో ఈ ఆసుపత్రి 25 ఏళ్ల (సిల్వర్ జూబ్లీ) పూర్తి చేసుకుంది.












Click it and Unblock the Notifications