జగన్ మాస్టర్ స్కెచ్, మంగళగిరి బరిలో కొత్త నేత - ఆ నియోజకవర్గాల్లోనూ..!!
ఏపీ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి పార్టీల అధినేతలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ సైతం 2029 లక్ష్యంగా పార్టీ కోసం ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ సారి కొత్త స్కెచ్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే వీటిల్లో సర్వేలు చేయిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి జగన్ ఊహించని అభ్యర్దిని బరిలోకి దించేందుకు సిద్దం అవుతున్నారు.
2029 ఎన్నికలే లక్ష్యంగా జగన్ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ చేసిన సమీక్షలో కీలక అంశాలను గుర్తించారు. అతి విశ్వాసంతో పాటుగా కేడర్ కు దూరం కావటం.. ప్రచార లోపం.. అభ్యర్దుల బదిలీలు... కొన్ని నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో అభిప్రాయాలకు విరుద్దంగా జరిగిన అభ్యర్దుల ఎంపిక.. పాలనా పరమైన లోపాలతో నష్టం జరిగిందని తేల్చారు. దీంతో.. తన పాదయాత్రకు ముందే కీలక నియోజకవర్గాల్లో అభ్యర్దులను ఖరారు చేసి వారిని ప్రజల్లోకి పంపాలని జగన్ భావిస్తున్నారు.

ఇందు కోసం కూటమి పార్టీలు బలం గా ఉన్న నియోజకవర్గాల పైన తొలి విడతలో ఫోకస్ చేసారు. వీటిల్లో ఇప్పటికే మూడు సర్వే సంస్థ లతో సర్వే చేయిస్తున్నారు. పార్టీ కేడర్ అభిప్రాయాలు అందులో ఉండే విధంగా సూచనలు చేసారు. ఎక్కడా మొహమాటం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. విదేశీ పర్యటన ముగించుకొని తాడేపల్లికి వచ్చిన జగన్ ను పార్టీ ముఖ్య నేతలు కలిసిన సమయంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
పార్టీ ముఖ్యుులతో జగన్ కీలక మంత్రాంగం
ఇక, జగన్ తాజాగా ఫోకస్ చేసిన నియోజకవర్గాల్లో మంగళగిరి సైతం ఉంది. టీడీపీ ముఖ్యనేత.. మంత్రి లోకేష్ ఇక్కడ 2024 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించారు. దీంతో.. ఈ సారి మంగళగిరి నుంచి జగన్ ఊహించని అభ్యర్దిని బరిలోకి దించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఆ అభ్యర్ది జగన్ సన్నిహిత నేత..ఇక ప్రముఖ హీరో బంధువు కావటంతో కేడర్ నుంచి మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. అదే విధంగా క్షేత్ర స్థాయిలో చేయిస్తున్న సర్వే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సమయంలోనే అమరావతి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పైనా జగన్ సర్వే చేయిస్తున్నారు. కూటమి కలిసే 2029 లో పోటీ చేస్తుందనే లెక్కలతో ఎన్నికల పోరాటానికి జగన్ తన అభ్యర్దుల ను ప్రాధమికంగా ఖరారు చేస్తున్నారు. ముందుగా పార్టీ సమన్వకర్తలుగా వారిని ప్రజల్లోకి పంపి.. కేడర్ లో జోష్ పెంచే బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో.. జగన్ తాజా నిర్ణయాలు పార్టీకి ఎంత వరకు కలిసి వస్తాయనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ సాగుతోంది.













Click it and Unblock the Notifications