వైజాగ్ లో యూజర్ ఛార్జీలపై వైసీపీ ఫైర్..! వాకర్లనూ వదలరా..?
వైజాగ్ లో ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటీకరిస్తూ, ప్రజలపై యూజర్ చార్జీల భారం వేయడంపై వైఎస్సార్సీపీ (ysrcp) మండిపడుతోంది. గ్రేటర్ పరిధిలోని రోడ్లు, పార్కులు, స్టేడియాలు, కళ్యాణ మండపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే చర్యలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయని ఆరోపించింది. నగరంలో ఐదు స్టేడియాలు, పార్కులు, దాదాపు 50 కళ్యాణ మండపాలు 99 ఏళ్ల దీర్ఘకాలిక లీజు పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వైసీపీ తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ప్రజా ఆస్తులు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వంటి సౌకర్యాల అభివృద్ధికి గతంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, ప్రస్తుతం ప్రజలపై యూజర్ ఛార్జీలు వేయడం వివాదస్పదంగా మారింది. ముఖ్యంగా వాకింగ్ వంటి సాధారణ ఆరోగ్య కార్యకలాపాలకే ఫీజులు విధించడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇకపై స్టేడియాల్లో నడకకు వచ్చే వారికి రూ.720 ప్రవేశానికి రుసుము చెల్లించాల్సి రావడం, సాధారణ ప్రజలపై అదనపు భారం మోపే చర్యగా మారిందని వైసీపీ తెలిపింది.

గతంలో వైసీపీ హయాంలో అభివృద్ధి చేసిన ప్రజా సౌకర్యాలను ఇప్పుడు ప్రైవేటుకు అప్పగించడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ఇవాళ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో నగరంలో ఆందోళన నిర్వహించిన నేతలు.. ప్రభుత్వం తమ నిర్ణయాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థల నుంచి అప్పులు తీసుకుని ప్రజల కోసం నిర్మించిన ఈ సౌకర్యాలపై ఇప్పుడు ఛార్జీలు విధించడం న్యాయసమ్మతమేనా అని కేకే రాజు ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ విధానాలపై పునరాలోచన చేయడం, ప్రజా ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని పౌర సమాజం, వివిధ వర్గాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications