చక్రం తిప్పిన అగ్ర హీరో. డీఎంకే, అన్నాడీఎంకే మధ్య మధ్యవర్తిత్వం?
ద్రవిడ గడ్డపై రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉండే రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల మధ్య ఇప్పుడు అనూహ్యమైన 'రాజీ' చర్చలు సాగుతున్నట్లు కోట వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఊహకు కూడా అందని ఈ కలయికకు, రాష్ట్రంలో వేగంగా పుంజుకుంటున్న ఒక 'కొత్త రాజకీయ శక్తి' అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. ఈ కీలక పరిణామాల వెనుక ఒక అగ్ర కథానాయకుడు మధ్యవర్తిత్వం వహిస్తుండటం ఇప్పుడు కోలీవుడ్ నుంచి కోట వరకు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళ రాజకీయాల్లో అనూహ్యంగా దూసుకొచ్చిన విజయ్ పార్టీ.. భవిష్యత్తులో తమ ఉనికికే ముప్పు తెస్తుందని ఇటు డీఎంకే, అటు అన్నాడీఎంకే భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే, వైరి పక్షాలైన ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రచారం జోరుగా జరుగుతుంది. రెండు విభిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలు.. జాతీయంగా కూడా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కూటమితో పొత్తుతోనే తమిళ నాట ఎన్నికల బరిలో దిగాయి. అయితే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు ప్రజలు. అయితే ఇక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే అవతరించిన తరుణంగా కేవలం ముఖ్యమంత్రి పీఠానికి 11 అడుగుల దూరంలో నిలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతుతో ఆ సంఖ్య 112కి చేరింది. అయినా ఇంకా ఆరుగురు మద్దతు కావాలి. దీని కోసం విజయ్ పడుతున్న తిప్పలు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది.

ఇందుకోసం తమిళ నాట అగ్ర కథానాయకుడిని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని మధ్యవర్తిత్వానికి ప్రతిపాదన పంపినట్లు సమాచారం. ప్రస్తుతం డీఎంకే కూటమి వద్ద 68 మంది ఎమ్మెల్యేలున్నారు. అలాగే అన్నాడీఎంకే వద్ద 53 మంది ఉన్నారు. వీరిద్దరి మధ్య పొత్తు కుదుర్చితే నిస్సంకోచంగా 121 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. డీఎంకే ఇందుకు ఒప్పుకుంటే.. అన్నాడీఎంకే ఎలాగో బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి కేంద్రం నుంచి స్టాలిన్ పార్టీకి అన్ని విధాలా అండగా ఉంటామని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహకరిస్తామని బీజేపీ అగ్రనేతలు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
కుటుంబ సభ్యుల ఒత్తిడి.. సందిగ్ధంలో సీఎం?
మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కు అన్నాడీఎంకేతో జతకట్టడం రాజకీయంగా, నైతికంగా ఇష్టం లేనప్పటికీ.. ఆయనపై కుటుంబ సభ్యుల నుంచి భారీగా ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తును, వారసుడి రాజకీయ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని, ఈ 'రాజీ' ఫార్ములాను అంగీకరించాలని ఆయన భార్య, కుమారుడు, ఆ సన్నిహిత సినీ పెద్దాయన పట్టుబడుతున్నట్లు సమాచారం. మొదట్లో స్టాలిన్ నిరాకరించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న సమీకరణాల దృష్ట్యా ఆయన తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటున్నట్లు భోగట్టా.
విజయ్ సంచలన నిర్ణయం.. రాజీనామాకు సిద్ధం!
ఈ రెండు ద్రవిడ పార్టీల పొత్తు వార్తలు వినపడుతున్న నేపథ్యంలో, కొత్తగా రంగప్రవేశం చేసిన విజయ్ కూడా తనదైన శైలిలో ప్రతివ్యూహాలు సిద్ధం చేశారు. ఒకవేళ డీఎంకే-అన్నాడీఎంకే గనుక పొత్తు కుదుర్చుకుంటే, తన పార్టీకి చెందిన 107 మంది ఎమ్మెల్యేలతో కలిసి సామూహిక రాజీనామాలు చేయడానికి ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రజల పక్షాన నిలబడాల్సిన పార్టీలు, అధికారం కోసం అపవిత్ర పొత్తులు పెట్టుకుంటే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తినా ఆశ్చర్యం లేదనే సంకేతాలను ఆయన వర్గం పంపుతోంది.
గవర్నర్ తీరుపై ఉత్కంఠ.. భవిష్యత్తు ఏంటి?
ఇదే సమయంలో తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు కూడా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న రాజ్‌భవన్, కేంద్రం నుంచి వచ్చే ఆదేశాల మేరకు అడుగులు వేస్తోంది. ఒకవేళ రాజీనామాల పర్వం మొదలైతే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా లేక మధ్యంతర ఎన్నికలకు వెళ్తారా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఏదేమైనా, తమిళనాడు రాజకీయాల్లో రాబోయే రోజులు అత్యంత కీలకమని, ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications