నిందితుడిని అరెస్ట్ చేస్తాం.. బండి భగీరథ్ పోక్సో కేసుపై స్పందించిన డీసీపీ రితిరాజ్!
తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పోక్సో కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తుకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో దర్యాప్తుపై కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలోని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బాధితురాలి కుటుంబం, బాధితురాలి స్టేట్మెంట్ నమోదు చేసిన సిట్
నిందితుడైన బండి భగీరథ్‌ను కచ్చితంగా పట్టుకుని అరెస్టు చేస్తామని, బాధితురాలికి త్వరిత న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డీజీపీ సీవీ ఆనంద్ ఏర్పాటు చేసిన SIT బృందం ఇప్పటికే బాధితురాలి కుటుంబం నుంచి వివరాలు సేకరించింది. రితిరాజ్ నేతృత్వంలోని బృందం మరోసారి బాధితురాలి స్టేట్‌మెంట్ రికార్డు చేస్తోంది.

చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం అన్న డీసీపీ
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నట్లు డీసీపీ రితిరాజ్ వెల్లడించారు. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్‌తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం అని వెల్లడించారు.
అతడిని ఎలాగైనా పట్టుకుంటామన్న SIT అధికారులు
బండి భగీరథ్ ప్రస్తుతం ఆచూకీ లేకపోవడంపై ప్రత్యేక దృష్టి సారించామని, అతడిని ఎలాగైనా పట్టుకుంటామని SIT అధికారులు ధీమా వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం అందించడం తమ ప్రధాన బాధ్యత అని రితిరాజ్ పేర్కొన్నారు. ఈ కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.
బండి భగీరథ్ కేసుపై బీఆర్ఎస్ మహిళా విభాగం తీవ్ర నిరసన
ఈ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ మహిళా విభాగం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టి, బండి భగీరథ్‌పై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కమిషనర్ కు వినతిపత్రం అందజేసి, బాలికకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.
పోక్సో కేసుతో తెలంగాణలో రాజకీయ దుమారం
ఈ పోక్సో కేసు తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతోంది. బాధితురాలి భద్రత, న్యాయం కోసం పోలీసు యంత్రాంగం కేసు దర్యాప్తు వేగవంతం చేసింది. SIT బృందం రోజువారీ పురోగతిని సమీక్షిస్తూ, కేసును త్వరగా ముగించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసు పరిణామాలు రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications