చెప్పిందే జరిగింది.. వ్యూహం అదిరింది.. లెక్క కుదిరింది!
అసోం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎ (NDA) కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. ట్రెండ్స్ ప్రకారం.. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముందుగా ఊహించినట్టే కూటమి 100 సీట్ల మార్కు వైపు దూసుకుపోతోంది. మొత్తం 126 స్థానాలకు గాను బీజేపీ ఒంటరిగానే 70కి పైగా చోట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. ఎన్నికల ప్రచారంలో "మేము 100 కొడతాం" అని హిమంత చెప్పిన మాటే ఇప్పుడు అక్షర సత్యమవుతోంది.
ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన సొంత నియోజకవర్గం 'జలుక్‌బరీ'లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. 2001 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఆయన, ఈసారి కూడా భారీ మెజారిటీ దిశగా వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ శిబిరంలో విషాదం నెలకొంది. అసోం కాంగ్రెస్ కీలక నేత గౌరవ్ గొగోయ్.. జోర్హాట్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉండటం ఆ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. అక్కడ బీజేపీ అభ్యర్థి హితేంద్ర నాథ్ గోస్వామి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

విపక్షాలు విలవిల.. లెక్క తప్పిన కాంగ్రెస్!
హిమంత వేసిన స్కెచ్ ముందు కాంగ్రెస్ వ్యూహాలు చిత్తు అయ్యాయి. కాంగ్రెస్ కేవలం 20 స్థానాలకే పరిమితం కాగా, అల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIUDF) కేవలం ఒక్క సీటులో మాత్రమే ముందంజలో ఉంది. "కాంగ్రెస్ 16-17 సీట్లకే పరిమితం అవుతుంది" అని హిమంత గతంలోనే ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఫలితాలు కూడా దాదాపు అదే దిశగా సాగుతున్నాయి. అఖిల్ గొగోయ్ పార్టీ 'రైజర్ దళ్' కూడా కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది.
గౌరవ్ గొగోయ్ ఆశలు.. బీజేపీ ధీమా!
ఫలితాల సరళిపై కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ స్పందిస్తూ.. "ఇది కేవలం ఆరంభం మాత్రమే, పూర్తి స్థాయి లెక్కింపు వరకు వేచి చూడాలి" అని కార్యకర్తలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతుండటంతో అసోంలో వరుసగా మూడోసారి కాషాయ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, అసోం గణ పరిషత్ వంటి మిత్రపక్షాలు కూడా కూటమికి బలాన్ని చేకూరుస్తున్నాయి.












Click it and Unblock the Notifications