బిర్యానీ, పుచ్చకాయ తిని ఒకే కుటుంబంలో నలుగురు మృతి
ముంబైలో షాకింగ్ ఘటన జరిగింది. అప్పటివరకూ సంతోషంగా గడిపిన ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా విగతజీవులుగా మారారు. బంధువులను ఇంటికి పిలిచి హ్యాపీగా గడిపారు. ఫ్యామిలీ మొత్తం బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి అందరూ పుచ్చకాయ తిన్నారు. ఆ తర్వాత అస్వస్థతకు గురై ఒక్కొక్కరుగా నలుగురు మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని పైధోనీ ప్రాంతానికి చెందిన డొకాడియా ఫ్యామిలీ మొత్తం గంటల వ్యవధిలో విగతజీవులుగా పడి ఉంది. బంధువులను ఇంటికి పిలిచి ఎంజాయ్ చేశారు ఆ భార్యాభర్తలు, ఇద్దరు కుమార్తెలు. అందరూ కలిసి బిర్యానీ తిన్నారు. బంధువులు తమ ఇళ్లకు వెళ్లిపోగా కొద్దిసేపటి తర్వాత పుచ్చకాయ ముక్కలు తిన్నారు. ఆ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురూ మృతి చెందారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. అబ్దుల్లా డొకాడియా(40), ఆయన భార్య నస్రీన్(35), ఇద్దరు కుమార్తెలు ఆయేషా(16), జైనాబ్(13) లు ముంబైలోని పైధోనీ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఇటీవల ఆ ఫ్యామిలీ.. తమ బంధువులను ఇంటికి పిలిచారు. రాత్రి వారితో కలిసి బిర్యానీ ఆరగించారు. అనంతరం బంధువులు ఇంటినుంచి వెళ్లిపోయిన తర్వాత అర్ధరాత్రి సమయంలో పుచ్చకాయ ముక్కలను తిన్నారు.

ఇక ఉదయం ఐదు గంటల నుంచి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి విషమించింది. తొలుత సమీపంలోని ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్లారు. ఆ తర్వాత వారిని జేజే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ భార్యాభర్తలు, వారి ఇద్దరు కుమార్తెలు మరణించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఫోరెన్సిక్, పోస్ట్ మార్టం నివేదికలు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు బయటకు వస్తాయని పోలీస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications