ఈ గౌను ధర తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. రూ.1,491 కోట్లు !!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై ప్రతి ఏడాది ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే లుక్స్ కనిపిస్తుంటాయి. అయితే 2026 కేన్స్ వేడుకల్లో బాలీవుడ్ గ్లామర్ క్వీన్ "ఊర్వశి రౌతేలా" మరోసారి అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నారు. రెడ్ కార్పెట్‌పై ఆమె కనిపించిన తీరు ప్రస్తుతం గ్లోబల్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తన అందం, స్టైల్, విలాసవంతమైన వస్త్రధారణతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే ఊర్వశి.. ఈసారి మాత్రం కేన్స్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన లుక్‌తో కొత్త రికార్డు సృష్టించారని ఫ్యాషన్ వర్గాలు చెబుతున్నాయి.
సుమారు 155.87 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు ₹1,491 కోట్లు) విలువ చేసే ఈ ప్రత్యేక కౌచర్ గౌన్‌ను ధరించి రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టిన ఊర్వశి.. అక్కడికి వచ్చిన అంతర్జాతీయ మీడియా, ఫ్యాషన్ విమర్శకులు, ఫోటోగ్రాఫర్ల దృష్టిని పూర్తిగా ఆకర్షించారు. ఈ డ్రెస్‌ను వియత్నాంకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ హౌస్ JoliPoli Couture ప్రత్యేకంగా రూపొందించింది. ఫాంటసీ స్టైల్, శిల్పకళాత్మక క్రిస్టల్ డిజైన్లకు ప్రసిద్ధి చెందిన ఈ బ్రాండ్ దాదాపు ఐదేళ్లపాటు శ్రమించి ఈ అద్భుత కళాఖండాన్ని తయారు చేసినట్లు సమాచారం.

ఈ గౌన్‌ను ఫ్యాషన్ విశ్లేషకులు "లిక్విడ్ లగ్జరీ"గా అభివర్ణిస్తున్నారు. వేలాది మెరిసే స్ఫటికాలు, ప్రత్యేక కాంతి ప్రతిబింబించే క్రిస్టల్ వర్క్‌తో రూపొందించిన ఈ వస్త్రధారణ.. కెమెరా ఫ్లాష్‌ల కాంతిలో వజ్రంలా మెరిసిపోయింది. రెడ్ కార్పెట్‌పై ఊర్వశి నడుస్తున్న ప్రతి క్షణం ఒక విజువల్ స్పెక్టకిల్‌లా కనిపించిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో "హ్యూమన్ డైమండ్", "గోల్డెన్ ఫీనిక్స్", "ఫ్యాషన్ ఎంప్రెస్" వంటి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ లుక్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది డేగ స్ఫూర్తితో రూపొందించిన భారీ హెడ్‌గేర్. శక్తి, ఆధిపత్యం, దూరదృష్టికి ప్రతీకగా రూపొందించిన ఈ కిరీటాన్ని క్లిష్టమైన మెటల్ ఫ్రేమ్, అరుదైన క్రిస్టల్స్‌తో ఎనిమిది నెలలపాటు తయారు చేసినట్లు డిజైనర్లు వెల్లడించారు. ఫ్యాషన్ రచయితలు దీనిని "కౌచర్ మిథాలజీ"గా అభివర్ణిస్తూ.. ఇది కేవలం ఫ్యాషన్ కాదు, ఒక కళాఖండమని ప్రశంసించారు. అంతే కాకుండా ఊర్వశి ధరించిన యాక్సెసరీలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బ్రాండ్ Judith Leiber రూపొందించిన క్రిస్టల్ మినాడియర్ బ్యాగ్‌తో పాటు, రంగురంగుల రత్నాలతో గుర్రపు ఆకృతిలో రూపొందించిన ప్రత్యేక క్లచ్ ఆమె లుక్‌కు మరింత రాయల్ టచ్ ఇచ్చాయి. డైమండ్ జువెలరీ, సిల్వర్ మెటాలిక్ హీల్స్, మెరిసే మేకప్, డ్రామాటిక్ హెయిర్ స్టైల్ కలిపి ఆమెను రెడ్ కార్పెట్‌పై ఒక ఫాంటసీ క్వీన్‌లా నిలబెట్టాయి. గత ఏడాది Cannes Film Festival 2025లో కూడా ఊర్వశి దాదాపు 155.86 మిలియన్ డాలర్ల విలువైన Michael Cinco గౌన్‌తో సంచలనం సృష్టించారు. అప్పట్లో కిమ్ కర్దాషియాన్ ధరించిన మార్లిన్ మన్రో ఐకానిక్ డ్రెస్ రికార్డును అధిగమించి ప్రపంచవ్యాప్తంగా చర్చకు తెర లేపారు. ఇప్పుడు మరోమారు తన సొంత రికార్డునే తానే బద్దలు కొట్టడంతో "కేన్స్ క్వీన్"గా సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఈ భారీ విలువలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. "ఒక గౌన్‌కే వేల కోట్లా?", "ఇంత డబ్బుతో చిన్న దేశాన్ని నిర్మించొచ్చు" అంటూ కొందరు విమర్శిస్తుంటే.. మరికొందరు మాత్రం "ఇది ఫ్యాషన్ ప్రపంచం, అక్కడ కళకు ధర ఉండదు" అంటూ ఊర్వశికి మద్దతుగా నిలుస్తున్నారు. కొందరు నెటిజన్లు "కేన్స్ రెడ్ కార్పెట్‌ను హాలీవుడ్ స్టార్‌ల కంటే ఎక్కువగా ఊర్వశి హైలైట్ చేసింది" అని కామెంట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications