బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. నితీష్ సంచలనం !
బీహార్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. సీఎం పదవికి రాజీనీమా చేసి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ తాను బీహార్‌ను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బాధ్యతలు చేపట్టినప్పటికీ.. తాను పాట్నాలోనే ఉంటూ ప్రభుత్వంపై నిఘా ఉంచుతానని నితీష్ కుమార్ ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నితీష్ లక్ష్యం ఇదే..
జేడీయూ ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తాను ఇకపై ప్రభుత్వ బాధ్యతల నుంచి విముక్తుడినై పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తానని వెల్లడించారు. బీహార్ అంతటా పర్యటించి కార్యకర్తలతో, ప్రజలతో నేరుగా మమేకమవుతానని ఆయన పేర్కొన్నారు. బీహార్‌లో తొలిసారిగా బీజేపీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు సడలకుండా చూడటం నితీష్ కుమార్ ముందున్న ప్రధాన లక్ష్యం.

కేడర్‌కు బలమైన సూచన
నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యుడిగా డిల్లీకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. తన సమయాన్ని ఎక్కువగా పాట్నాలోనే గడుపుతానని పేర్కొన్నారు. సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని ప్రభుత్వం ఎలా పని చేస్తోంది, ప్రజలకు అందుతున్న సేవలు ఎలా ఉన్నాయనే అంశాలపై నిరంతరం నిఘా ఉంచుతానని ఆయన చెప్పడం వెనుక ఓ వ్యూహం కనిపిస్తోంది. తద్వారా బీహార్ రాజకీయాల్లో తన ప్రాముఖ్యత ఏ మాత్రం తగ్గలేదని ఆయన పరోక్షంగా కార్యకర్తలకు సంకేతాలు పంపారు.
ఈ వ్యూహం వెనుక కీలక కారణం
ఈ కొత్త వ్యూహం వెనుక మరో కీలక కారణం తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయంగా నిలబెట్టడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. నిశాంత్ కుమార్ ఇప్పటికే బీహార్‌లోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. నితీష్ కుమార్ తన రాజకీయ అనుభవంతో కుమారుడికి మార్గనిర్దేశం చేస్తూ.. బిహార్ రాజకీయాల్లో వారసుడిగా నిలబెట్టడానికి వేదికను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి 'బీహార్‌ను వదలను.. ప్రభుత్వంపై కన్నేసి ఉంచుతాను' అన్న నితీష్ ప్రకటనతో బిహార్ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications