Vijay: విజయ్ కు మళ్లీ గవర్నర్ షాక్..! రెండోసారీ నిరాశే..!
తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఇవాళ రెండోసారి లోక్ భవన్ కు వెళ్లి విజ్ఞప్తి చేసిన విజయ్ (Vijay)కు మరోసారి నిరాశే ఎదురైంది. నిన్న 112 మంది ఎమ్మెల్యేల జాబితా సమర్పించి తనకు అవకాశం ఇస్తే మెజార్టీ నిరూపించుకుంటానని హామీ ఇచ్చిన విజయ్ కు గవర్నర్ (Governor) ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో మరోసారి ఇవాళ గవర్నర్ వద్దకు వెళ్లిన విజయ్.. కేవలం ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే తక్కువ ఉన్నందున అవకాశం ఇవ్వాలని కోరినా ఫలితం దక్కలేదు.
తమిళనాడు లోక్ భవన్ వర్గాల సమాచారం మేరకు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నంపై గవర్నర్ సంతృప్తి చెందలేదు. అలాగే ఆ పార్టీ 118 సీట్ల మెజార్టీ మార్కును నిరూపించుకోవాలని కోరారు.చిన్న పార్టీలు మద్దతు ఇవ్వవచ్చనే ఊహతో విజయ్ తన వాదనను వినిపిస్తున్నారా అని గవర్నర్ ఆయన్ను ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ స్థిరత్వాన్ని కూడా ప్రశ్నించారు. సభలో మెజారిటీని ఎలా నిరూపించుకుంటారో, అలాగే తనకు మద్దతు ఇస్తున్నట్లు సూచించిన పార్టీల నుండి మద్దతు లేఖలను చూపించాలని గవర్నర్ విజయ్‌ను కోరారు.

మరోవైపు గవర్నర్ నిర్ణయంపై స్పందిస్తూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న తమ అభ్యర్థనను పునఃపరిశీలించాలని గవర్నర్‌ను కోరుతూ, మెజారిటీ లేకుండానే అతిపెద్ద పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాదించిన దాఖలాలు గతంలో ఉన్నాయని టీవీకే పేర్కొంది. సభలో తమకు అవసరమైన సంఖ్యాబలాన్ని నిరూపించుకోగలమనే విశ్వాసంతో ఉన్నామని టీవీకే గవర్నర్‌కు తెలిపింది.అయినా గవర్నర్ సంతృప్తి చెందకపోవడంతో మరోసారి విజయ్ ప్రమాణ స్వీకారం వాయిదా వేసుకోవాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఈ నేపథ్యంలో విజయ్ తనకు మద్దతిచ్చే ఇతర పార్టీలతో చర్చల్ని ముమ్మరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications