కోహినూర్ డైమండ్ తిరిగి భారత్‌కు!: బ్రిటన్ రాజుకు అనూహ్య రిక్వెస్ట్!
ఆ వజ్రం ధగధగలు ఒకప్పుడు భారతీయ సింహాసనాల వైభవాన్ని చాటాయి.. ఆ రత్నాల కాంతులు మన దేవాలయాల గర్భాలయాల్లో వెలుగులు విరజిమ్మాయి. కానీ కాలగమనంలో, విదేశీ దండయాత్రల ధాటికి మన 'జాతి' సంపద సముద్రాలు దాటి పరాయి గడ్డకు చేరింది. తాజాగా న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ, బ్రిటన్ రాజు ఛార్లెస్-3ని కలిసి "కోహినూర్ వజ్రాన్ని భారత్‌కు ఇచ్చేయమని అడుగుతా" అని అడుగుతానని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
ప్రపంచంలోనే అత్యంత వివాదాస్పదమైన, ప్రసిద్ధమైన వజ్రం కోహినూర్. 105.6 క్యారెట్ల ఈ వజ్రం మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కు పాలకుల చేతులు మారుతూ చివరకు బ్రిటన్ చేరింది. 1849లో పంజాబ్‌ను ఆక్రమించిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని విక్టోరియా రాణికి బహుకరించింది. ప్రస్తుతం ఇది బ్రిటన్ రాణి కిరీటంలో మెరుస్తోంది. భారత్ దీని కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, అది ఇప్పటికీ లండన్ లోనే బందీగా ఉంది.

కోహినూర్ ప్రయాణం సాగిందిలా..
కోహినూర్ వజ్రం ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో గల కొల్లూరు గనుల్లో (గోల్కొండ రాజ్య పరిధి) లభించిందని చరిత్రకారులు నమ్ముతారు. ఇది తొలుత కాకతీయుల ఆరాధ్య దైవం భద్రకాళి అమ్మవారి కన్నుగా ఉండేదని ప్రతీతి. 14వ శతాబ్దం ఆరంభంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణాదిపై దండెత్తినప్పుడు, మాలిక్ కాఫుర్ ద్వారా ఈ వజ్రం కాకతీయుల నుంచి ఖిల్జీ వంశం చేతికి చిక్కింది. ఆ తర్వాత ఇది వరుసగా తుగ్లక్‌లు, సయ్యద్‌లు, లోడీల చేతులు మారుతూ బాబర్ ద్వారా మొఘల్ సామ్రాజ్యానికి చేరింది.
మొఘలుల నుంచి పర్షియాకు..
మొఘల్ చక్రవర్తి షాజహాన్ హయాంలో ఈ వజ్రం ప్రసిద్ధ 'నెమలి సింహాసనం'లో (Peacock Throne) పొదగబడింది. అయితే, 1739లో పర్షియన్ పాలకుడు నాదిర్ షా భారత్‌పై దండెత్తి ఢిల్లీని దోచుకున్నప్పుడు, తనతో పాటు నెమలి సింహాసనాన్ని, కోహినూర్‌ను పట్టుకెళ్లిపోయాడు. మొదటిసారి ఈ వజ్రానికి 'కోహినూర్' అని పేరు పెట్టింది నాదిర్ షాయే. అతని మరణం తర్వాత ఇది అఫ్గాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీ చేతికి చేరింది.
తిరిగి భారత్‌కు.. ఆపై లండన్‌కు..
1813లో అఫ్గాన్ పాలకుడు షా షూజా తన ప్రాణరక్షణ కోసం పంజాబ్ కేసరి మహారాజా రంజిత్ సింగ్ శరణు కోరి, ప్రతిఫలంగా కోహినూర్‌ను ఆయనకు బహూకరించాడు. అలా వజ్రం తిరిగి భారత్‌కు చేరింది. రంజిత్ సింగ్ దీన్ని తన భుజకీర్తిగా ధరించేవాడు. అయితే, 1849లో రెండో ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత బ్రిటిష్ వారు పంజాబ్‌ను ఆక్రమించారు. అప్పటి పాలకుడు, చిన్న బాలుడైన దులీప్ సింగ్‌తో బలవంతంగా లాహోర్ ఒప్పందంపై సంతకం చేయించి, వజ్రాన్ని విక్టోరియా రాణికి 'బహుమతి'గా ఇచ్చేలా చేశారు. 1850లో ఇది అధికారికంగా లండన్ చేరింది.
భారత్ చేస్తున్న ప్రయత్నాలు..
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్ తన 'కోహినూర్' కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. 1947-1953 మధ్య భారత్ స్వాతంత్య్రం పొందిన వెంటనే, క్వీన్ ఎలిజబెత్ II పట్టాభిషేకం సమయంలో అధికారికంగా వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని కోరింది. కానీ బ్రిటన్ తిరస్కరించింది. 1976లో పాకిస్తాన్ కూడా ఈ వజ్రంపై హక్కు కోరింది. కానీ భారత్ తన చారిత్రక సాక్ష్యాలను బలంగా వినిపించింది. పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజపేయి హయాంలో కూడా దౌత్యపరమైన చర్చలు జరిగాయి.
2016 వివాదం
ఒక సందర్భంలో భారత ప్రభుత్వం సుప్రీంకోర్టులో మాట్లాడుతూ.. కోహినూర్ దొంగిలించబడలేదని, అది బహుమతిగా ఇచ్చిందని వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపింది. అయితే వెంటనే ప్రభుత్వం ఆ వ్యాఖ్యను సరిచేసుకుంటూ.. దాన్ని తిరిగి రప్పించేందుకు అన్ని దౌత్య మార్గాలను అన్వేషిస్తున్నామని స్పష్టం చేసింది.
ప్రస్తుత పరిస్థితి..
ఇటీవలి కాలంలో వలసవాద దేశాలు దోచుకున్న వస్తువులను తిరిగి ఇచ్చేయాలనే అంతర్జాతీయ చర్చ (Restitution) ఊపందుకుంది. ఇదే క్రమంలో మోదీ ప్రభుత్వం కూడా బ్రిటన్‌పై ఒత్తిడి పెంచుతోంది. న్యూయార్క్ మేయర్ మమ్దానీ వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, అది కొన్ని కోట్ల మంది భారతీయుల ఆకాంక్ష. ఈ వజ్రాలు కేవలం రాళ్లు కావు.. అవి మన పూర్వీకుల వైభవానికి, మన గడ్డపై వికసించిన కళాత్మకతకు సజీవ సాక్ష్యాలు. ఈ రత్నాలు ఎప్పటికైనా సొంత గడ్డకు తిరిగి వస్తాయా? లేక విదేశీ మ్యూజియాల్లోనే చరిత్రకు సాక్ష్యాలుగా మిగిలిపోతాయా? అన్నది కాలమే నిర్ణయించాలి.












Click it and Unblock the Notifications