రైతుల ఖాతాలలో డబ్బులు జమ.. మంత్రి ఉత్తమ్ కుమార్ శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త చెప్పారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1.84 లక్షల మంది రైతుల నుండి సుమారు 14.40 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు తెలిపారు.
రైతుల ఖాతాలలో 2001.96 కోట్ల రూపాయల జమ
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతుల ఖాతాలలో 2001.96 కోట్ల రూపాయలను జమ చేసినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇక ధాన్యం కొనుగోలుకు సంబంధించిన చెల్లింపుల్లో ఎటువంటి జాప్యం జరగకుండా చూస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కొనుగోళ్ళ వేగాన్ని మరింత పెంచాలని రైతులకు కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరిక
ధాన్యం కొనుగోళ్లు పూర్తి అయిన తర్వాత వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అంతేకాదు రాబోయే మూడు నాలుగు రోజులలో వర్ష సూచన ఉన్న కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే అకాల వర్షాలతో నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, సూర్యాపేట వంటి జిల్లాలలో ధాన్యం తడిసిపోయిన సంఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు.
ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా టార్పాలిన్లు
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం కాకూడదని, ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద సరిపడా టార్పాలిన్ కవర్లను సిద్ధంగా ఉంచాలని మంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వర్షానికి తడిసిన ధాన్యం విషయంలో నిబంధనలను సడలించి వాటిని వెంటనే పారా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ధాన్యం కొనుగోళ్లలో దళారీల ప్రమేయం లేకుండా కనీస మద్దతు ధర
ధాన్యం తరలింపులో లారీలు కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారీల ప్రమేయం లేకుండా.. కనీస మద్దతు ధర నేరుగా రైతులకు అందేలా ప్రభుత్వం పారదర్శకమైన ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications