శంషాబాద్ ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నంబర్ 16 వద్ద నిలిపివున్న లారీని వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో దారుణ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కారులోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.
కారు లారీ కిందికి చొచ్చుకుపోవడంతో ఘోర ప్రమాదం
మృతుల్లో ఇద్దరు చిన్నారులు, మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. అతి వేగంగా దూసుకొచ్చిన కారు లారీ కిందికి చొచ్చుకుపోవడంతో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

అతి వేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది అనేక ప్రయత్నాల తర్వాత మృతదేహాలను కారు నుంచి బయటికి తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం ఏడుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు తేలింది. వారిలో ఆరుగురు అక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, అతి వేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు.
గాయాలతో బయటపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి ఆదేశం
ఈ సమాచారం తెలిసిన వెంటనే వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రమాద ఘటనకు గల కారణాలను ఆరా తీశారు. ఆగి ఉన్న లారీని అతి వేగంగా డీ కొట్టిన కారు డ్రైవర్ దే తప్పని తెలుస్తుంది. ఈ ఘటనలో అతను కూడా ప్రాణాలు కోల్పోయారు.
అతివేగం ప్రాణాంతకం .. వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం
అతి వేగం ప్రమాదకరం అని ఎంతగా చెప్పినా మితి మీరిన వేగంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే తాజా ప్రమాదం కూడా అతి వేగానికి ఒక ఉదాహరణ. అనవసరంగా నిండు ప్రాణాలు బలిగొన్న ఈ ఘటన వారి కుటుంబాలలో తీవ్ర విషాదం మిగిల్చింది.












Click it and Unblock the Notifications