చెరువుల పునరుద్ధరణలో ఇళ్ళు కోల్పోయిన నిరుపేదలకు శుభవార్త చెప్పిన హైడ్రా కమీషనర్!
గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కారణంగా ఇళ్ళు కోల్పోయిన పేద కుటుంబాలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. చెరువుల పునరుద్ధరణ పనుల్లో నివాసాలు కోల్పోయిన పేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కీలక ప్రకటన చేశారు.
నిరుపేదలైన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు
హైడ్రా చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసి పునరుద్ధరించిన సమయంలో నిరుపేదలు ఇబ్బంది పడకుండా చూడాలని ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ క్రమంలోనే నిరుపేదలైన వారికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇవ్వాలని నిర్ణయించింది. ఇదే సమయంలో కబ్జాదారులపైన కఠిన చర్యలకు ఉపక్రమించింది.

శాటిలైట్ చిత్రాలు, google maps ఆధారంగా జాబితా
జులై 19 2024 కు ముందు చెరువు పరిసరాలలో నివాసం ఉన్న వారిని శాటిలైట్ చిత్రాలు, google maps ఆధారంగా గుర్తించి జాబితాను తయారుచేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించడానికి నిర్ణయం తీసుకుంటున్నారు. కబ్జాదారులు పేదల పేరుతో చేసే దుష్ప్రచారానికి తావు లేకుండా పకడ్బందీగా చర్యలను చేపట్టారు.
బాధితులతో సమావేశం నిర్వహించిన హైడ్రా కమీషనర్
ఈ క్రమంలోనే తాజాగా మాదాపూర్ లోని సున్నం చెరువు, రామంతపూర్ చెరువు బాధితులతో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రత్యేక సమావేశం నిర్వహించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించి శాశ్వత నివాస వసతి కల్పించడానికి ఆయన హామీ ఇచ్చారు.
క్షేత్రస్థాయి సర్వేలు, పక్కా ఆధారాలతో ఇళ్ళు
హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నిర్వహించిన ఈ సమావేశంలో చాలామంది పేదలు, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల నుంచి బ్రతకడానికి వచ్చినవారు, వలస కార్మికులు, చెత్త ఏరే వారు పాల్గొన్నారు. వీరందరికీ క్షేత్రస్థాయి సర్వేలు, పక్క ఆధారాలను తీసుకుని ఇళ్ళు మంజూరు చేస్తామని ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు.
చెరువుల పునరుద్ధరిస్తున్న హైడ్రా.. చెన్నై అధికారుల ప్రశంసలు
హైదరాబాద్లో చెరువుల కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులకు షాక్ ఇస్తూ అనేక చెరువులను పునరుద్ధరించి వేల ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ చర్యలను చెన్నై అధికారులు కూడా ప్రశంసించారు.












Click it and Unblock the Notifications