బైక్ పై వెళ్తూనే హెల్మెట్ తో కొట్టి అత్తను చంపిన అల్లుడి డ్రామా!
హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భార్యపై కోపంతో అత్తను బైక్‌పై తీసుకు వెళ్తూ హెల్మెట్‌తో తలపై కొట్టి చంపిన ఘటన ఒక్కసారిగా అందర్నీ షాక్ కు గురి చేసింది. అత్త ఫిట్స్ వచ్చి క్రింద పడిందని డ్రామా ఆడి అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసిన అల్లుడి నిర్వాకం సీసీటీవీ ఫుటేజ్‌తో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అల్లుడితో అత్త ఘర్షణ
మేడ్చల్ జిల్లా చెంగిచర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కావ్య గతే ఏడాది కరీంనగర్ కు చెందిన స్నేహిత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూతురు కావ్యతో అతని వ్యవహార శైలి బాగోక పోవటంతో అత్త అల్లుడితో తరచూ గొడవ పడుతుంది.

బైక్ పై తీసుకెళ్తూ హెల్మెట్ తో కొట్టి చంపిన అల్లుడు
ఏప్రిల్ 29న స్నేహిత్ అరుణను బైక్‌పై ఎక్కించుకుని వెళ్తూ ఉండగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. దీంతో స్నేహిత్ బైక్ నడుపుతూనే హెల్మెట్ తీసి, హెల్మెట్‌తో అత్త తలపై బలంగా కొట్టాడు. దీంతో అరుణ కిందపడి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
ఫిట్స్ వచ్చిందని అల్లుడి డ్రామా.. సీసీటీవీ ఫుటేజ్ చూసి షాక్
ఘటన జరిగిన వెంటనే స్నేహిత్ భార్య కావ్యకు ఫోన్ చేసి అత్తమ్మ ఫిట్స్ వచ్చి బైక్ నుంచి పడిపోయింది అని చెప్పి మోసం చేశాడు. అయితే స్నేహిత్ ప్రవర్తనలో అనుమానం వచ్చిన కావ్య సీసీటీవీ ఫుటేజ్ చూసి నిజం తెలుసుకుంది. తన తల్లి మరణానికి భర్త కారణమని తెలుసుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కావ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అత్తను చంపిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు విచారణ చేస్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తల్లిని చంపిన అల్లుడు జైలు పాలు కాగా, తల్లిని కోల్పోయి, కట్టుకున్న వాడు నేరస్తుడుగా మారటంతో కావ్య కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది.












Click it and Unblock the Notifications