తెలంగాణ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..
తెలంగాణ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ మీటింగ్ లో రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ మంత్రివర్గ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ విషయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. కేబినెట్ సమావేశంలో కార్మికుల డిమాండ్లు, సమస్యల పరిష్కారంపై కీలకంగా చర్చించామని, రేపు ఐదుగురు మంత్రులు కార్మిక సంఘాలతో చర్చిస్తారని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. నర్సంపేట, నల్గొండ ఘటనలపై కేబినెట్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందని ఆర్టీసీ కార్మికులు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
అలాగే మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో 50 శాతం రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ లో సుమారు రూ. 6 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అన్నారు. వారికి ఇవి ఎలా ఇవ్వాలన్నదానిపై త్వరలోనే స్పష్టతనిస్తామన్నారు. దాంతోపాటు కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఒత్తిడి చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిందన్నారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో సబ్ కమిటీ వేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీ వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించింది. ఇకనుంచి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ 26 న వాసవీ జయంతి రానున్న నేపథ్యంలో ఆ రోజున ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో వాసవీ మాత జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications