విజయవాడ-బెంగళూరు జాతీయ రహదారి 544G.. బెంగళూరుకు 8 గంటల్లోనే
ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో విజయవాడ నుంచి బెంగళూరు వరకు నిర్మాణం జరుగుతున్న గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే NH 544Gలో భాగంగా నెల్లూరు జిల్లాలో 3.68 కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల టన్నెల్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ టన్నెల్ పూర్తి అయితే విజయవాడ-బెంగళూరు మధ్య ప్రయాణం మరింత సులభం మరియు వేగవంతం అవుతుంది.
రూ.857.75 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల టన్నెల్
ఈ ప్రాజెక్ట్ భారతమాలా పరియోజనలో భాగంగా చేపట్టబడింది. నెల్లూరు జిల్లాలోని సీతారామపురం ప్రాంతం నుంచి మొదలై కడప జిల్లాలోకి వెళ్లే ఈ టన్నెల్ రూ.857.75 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతోంది. మ్యాక్స్ ఇన్‌ఫ్రా కంపెనీ ఈ పనులు చేపట్టింది. రెండు వైపులా తవ్వకం పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రతి టన్నెల్ 16.7మీటర్ల వెడల్పు, 9.8మీటర్ల ఎత్తుతో నిర్మించబడుతోంది. వెళ్లే వాహనాలు, వచ్చే వాహనాల కోసం వేర్వేరు సొరంగాలు ఏర్పాటు చేస్తున్నారు.

రాష్ట్రంలోనే పొడవైన టన్నెల్‌గా రికార్డు
ఈ టన్నెల్ 2027 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత 15 ఏళ్ల పాటు ఆ కంపెనీనే నిర్వహణ బాధ్యత కూడా నిర్వహిస్తుంది. ఈ టన్నెల్ రాష్ట్రంలోనే పొడవైన టన్నెల్‌గా రికార్డు సృష్టించనుంది. విజయవాడ-బెంగళూరు మధ్య మొత్తం 518కిలోమీటర్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరుగుతోంది. ఈ హైవే పూర్తి కావడంతో ప్రస్తుత దూరం 100కిలోమీటర్లు తగ్గి, ప్రయాణ సమయం సుమారు 3గంటలు ఆదా అవుతుంది.
నెల్లూరు, కడప జిల్లాల్లో ఉపాధి అవకాశాలు,ఆర్ధిక ప్రగతి
ప్రయాణికులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కొడికొండ నుంచి ప్రారంభమై ప్రకాశం, బాపట్ల జిల్లాల గుండా NH 16తో అనుసంధానం అవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, పర్యాటకం మరింత ఊపందుకుంటాయి. ప్రత్యేకించి నెల్లూరు, కడప జిల్లాల్లో ఉపాధి అవకాశాలు పెరిగి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశం ఉంది.
విజయవాడ నుంచి బెంగళూరుకు 8 గంటల్లో
ప్రస్తుతం హైవేలోని మిగిలిన భాగాల్లో కూడా పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అండర్‌పాస్‌లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం ఊపందుకుంది. ఈ అత్యాధునిక హైవే మరియు టన్నెల్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో కొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రయాణికులు ఇకపై విజయవాడ నుంచి బెంగళూరుకు 8 గంటల్లో చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అధికారులు పనులను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.












Click it and Unblock the Notifications