తెలంగాణ ప్రజలకు బిగ్ రిలీఫ్.. ఆ కార్యాలయాల్లో అదనపు పని వేళలు
ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని.. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోల్చితే భారీగా హెచ్చుతగ్గులు ఉన్న భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి పని వేళలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజా ఆదేశాలతో మే 12 నుంచి అధిక రద్దీ కలిగిన చంపాపేట్, సరూర్ నగర్, వనస్థలి పురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్ నగర్, షాద్ నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్ బీనగర్, శేరిలింగంపల్లి, సంగారెడ్డి, ఘట్ కేసర్, నల్గొండ ఆర్వో, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పనివేళలు ఉండనున్నాయి. ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అవసరమైతే మరింత పనివేళలు పొడిగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. అందుకు తగిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత, వేగం, ప్రజలకు సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ జరిగే తహశీల్దార్ కార్యాలయాలను కూడా సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా స్లాట్ బుకింగ్స్ సంఖ్యను పెంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట్రంలోని ఇతర రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రద్దీని బట్టి అదనపు సమయాన్ని కేటాయించాలని సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications