దగ్గరుండి మరీ కాపీ కొట్టించి.. అడ్డంగా దొరికిన టీచర్లు!
విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే దారి తప్పారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కాపలా ఉండాల్సిన సిబ్బందే.. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని అక్రమాలకు తెరలేపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను విద్యార్థుల భవిష్యత్తు కోసం వాడాల్సింది పోయి, బోర్డు పరీక్షల్లో 'చీటింగ్' చేయడానికి వాడి అడ్డంగా దొరికిపోయారు. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన ఈ 'హైటెక్ మాస్ కాపీయింగ్' ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షల సందర్భంగా బీడ్ జిల్లాలోని కొన్ని కేంద్రాల్లో వింత దృశ్యాలు కనిపించాయి. సాధారణంగా విద్యార్థులు గుట్టుచప్పుడు కాకుండా చీటీలు తెచ్చుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఏకంగా ఎగ్జామినేషన్ సిబ్బందే రంగంలోకి దిగారు. స్మార్ట్‌ఫోన్లలో చాట్‌జీపీటీ (ChatGPT) ఓపెన్ చేసి, ప్రశ్నలకు సమాధానాలు వెతికి మరీ విద్యార్థులకు చేరవేశారు. టెక్నాలజీని ఉపయోగించి పరీక్షా వ్యవస్థనే అపహాస్యం చేసేలా ఈ 'గురు' విన్యాసాలు సాగాయి.

విచారణలో షాకింగ్ నిజాలు!
పరీక్షల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో మహారాష్ట్ర స్టేట్ బోర్డ్ అధికారులు రంగంలోకి దిగారు. బీడ్ జిల్లాలోని పలు పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా, అక్కడ జరుగుతున్న తతంగం చూసి అధికారులు విస్తుపోయారు. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన టీచర్లు, ఏఐ చాట్‌బాట్లను ఉపయోగించి సమాధానాలు కాపీ కొట్టించడంలో బిజీగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంత దారుణంగా దుర్వినియోగం చేయడంపై బోర్డు సీరియస్ అయ్యింది.
81 మందిపై వేటు.. విద్యాశాఖ సీరియస్ వార్నింగ్
పరీక్షల పవిత్రతను దెబ్బతీసినందుకు గానూ జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమాలకు సహకరించిన 81 మంది ఎగ్జామినేషన్ సిబ్బందిని ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి హైటెక్ కాపీయింగ్ ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. బోర్డు పరీక్షల విశ్వసనీయతను కాపాడటానికి ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications