Perplexity Computer: పర్ ప్లెక్సిటీ మరో సంచలనం-ఇక ఏఐ కంప్యూటర్..!
ఏఐలో దుమ్మురేపుతున్న అమెరికన్ కంపెనీ పర్ ప్లెక్సిటీ (perplexity) ఇప్పుడు మరో కొత్త ప్రొడక్ట్ తో తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సిద్దమవుతోంది. అదే పర్ ప్లెక్సిటీ కంప్యూటర్ ( perplexity computer). ఏఐ ఆధారిత టూల్స్ సాయంతో పనిచేసే ఈ అత్యాధునిక కంప్యూటర్ మోడల్ కు సంబంధించిన వివరాల్ని సీఈవో అరవింద్ శ్రీనివాసన్ తాజాగా వెల్లడించారు. AI-ఆధారిత అసిస్టెంట్‌ల సామర్థ్యాలను పునర్నిర్వచించే లక్ష్యంతో ఈ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తిని రూపొందించినట్లు తెలిపారు.
AI-ఆధారిత సమాధానాల ఇంజిన్‌గా ప్రారంభమైన పెర్‌ప్లెక్సిటీ ప్రస్ధానం.. ఇప్పుడు 'పెర్‌ప్లెక్సిటీ కంప్యూటర్' ద్వారా ఈ సామర్థ్యాలను గణనీయంగా విస్తరించేదాకా అభివృద్ది చెందింది. ఈ కంప్యూటర్ పై రెండు నెలల ముందే హింట్ ఇచ్చిన సీఈవో అరవింద్.. అప్పటి నుంచీ మౌనంగా ఉన్నారు. మళ్లీ ఇవాళ ఎక్స్ లో దీనిపై కీలక ప్రకటన చేశారు. మా తదుపరి గొప్ప ఆవిష్కరణ పెర్‌ప్లెక్సిటీ కంప్యూటర్‌పై రెండు నెలలుగా పని చేశామని వెల్లడించారు.

ఇది ప్రస్తుత కంప్యూటర్, ఏఐ యొక్క సామర్థ్యాల్ని ఒకే సిస్టమ్‌లోకి ఏకం చేస్తుందని తెలిపారు. ఫైల్‌లు, టూల్స్, మెమరీ , మోడల్‌లు కలిసి మీ కోసం పని చేస్తాయన్నారు. సింపుల్ గా చెప్పాలంటే.. పెర్‌ప్లెక్సిటీ కంప్యూటర్ ఏఐ అసిస్టెంట్‌లకు మరింత శక్తినిచ్చే ఏఐ సామర్థ్యాలను అందిస్తుందన్నారు. ఇది కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదా చిన్న కోడ్ భాగాలను అందించడం మాత్రమే కాకుండా, ఒక సాధారణ-ప్రయోజన డిజిటల్ ఉద్యోగిగా పనికొస్తుందన్నారు. పరిశోధన, కోడింగ్, డ్రాఫ్టింగ్, అమలు, వర్క్‌ఫ్లోలను నిర్వహించడం వంటి అనేక రకాల పనులను కనీస మానవ పర్యవేక్షణతో స్వతంత్రంగా చేయగల వర్చువల్ ఏజెంట్ ఇది అన్నారు.

పెర్‌ప్లెక్సిటీ కంప్యూటర్ ప్రస్తుతం తమ హై ఎండ్ సబ్‌స్క్రైబర్‌లైన 'పెర్‌ప్లెక్సిటీ మ్యాక్స్' వినియోగదారులకు అందుబాటులో ఉంది. త్వరలో 'ప్రో యూజర్‌ల'కు కూడా అందుబాటులోకి వస్తుందని సంస్ద తెలిపింది. దీని ద్వారా ఇప్పుడు యూజర్లు కేవలం ఫలితాలను అడగడం లేదా బ్రౌజ్ చేయడం కాకుండా, సృజనాత్మక, సాంకేతిక లేదా పరిశోధనాత్మక పనులను ఏఐకి అప్పగించి, అవుట్‌పుట్‌లను పొందవచ్చు. నిజానికి పెర్‌ప్లెక్సిటీ కంప్యూటర్ కేవలం ఒక సెర్చ్ ఇంజిన్ కంటే చాలా ఎక్కువ.












Click it and Unblock the Notifications