keyboard_backspace

బతుకమ్మ పండుగ చరిత్ర .. 12 వ శతాబ్దం నుండే బతుకమ్మ, ప్రాచుర్యంలో ఎన్నో విశేషమైన కథలు!!

Google Oneindia TeluguNews

బతుకమ్మ తెలంగాణ ప్రాంతానికి సొంతమైన, శక్తివంతమైన పండుగ. మహిళలు మాత్రమే విశేషంగా జరుపుకునే పండుగ. తెలంగాణా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా పెరిగే పువ్వులతో జరుపుకునే మహోత్సవం. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నం. బతుకమ్మ శీతాకాలం ప్రారంభానికి ముందు, వర్షాకాలం చివరలో అంటే రెండు కాలాలకు సంధికాలంలో వస్తుంది. వర్షాకాలంలో తెలంగాణలోని అన్నీ చెరువులు పుష్కలంగా నీటితో నిండి ఉంటాయి. సాగు చేయని , బంజరు భూములలో అడవి పువ్వులు వివిధ రంగులలో వికసించి ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ప్రకృతి పరవశంలో ఉన్న సమయంలో గౌరీ దేవిని పూజించి జరుపుకునే బతుకమ్మకు ఎంతో విశిష్టత ఉంది. బతుకమ్మ పండుగ సమయంలో గునుగు పూలు, తంగేడు పూలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. బతుకమ్మను తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ మహిళలు విశేషంగా జరుపుకుంటారు. ఆడపిల్లలు బతుకమ్మ వేడుక చేసుకోవటానికి అమ్మగారింటికి చేరుకుంటారు. తొమ్మిది రోజుల పాటు పుట్టింట్లో రంగురంగుల పుష్పాలతో బతుకమ్మను పేర్చి గౌరీ దేవిని పూజిస్తారు.

బతుకమ్మ పండుగ వెనుక ఎన్నో కథలు .. చోళ రాజు ధర్మాంగద కుమార్తె కథ
బతుకమ్మ పండుగ నేపథ్యం విషయానికి వస్తే రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకప్పుడు చోళ రాజవంశానికి చెందిన ధర్మాంగద అనే రాజు ఉండేవాడు. ఈ రాజు ఎక్కువగా దక్షిణ భారతదేశాన్ని పాలించాడు. ఆ రాజుకు వంద మంది కుమారులు పుట్టి మరణించారు. లక్ష్మీ దేవి అనుగ్రహంతో అతని భార్య ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. లక్ష్మి ఆమె పెరుగుతున్న క్రమంలో అనేక అనుకోని ప్రమాదాలు, సంఘటనల నుండి బయటపడింది. తల్లిదండ్రులు తమ ఏకైక బిడ్డను పెంచుకుంటూనే లక్ష్మి గురించి ఆందోళన చెందేవారు. తరువాత వారు తమ కుమార్తెకు బతుకమ్మ అని పేరు పెట్టారు. అలా పెట్టడం వల్ల గండాలను అధిగమించి ఆమె బ్రతుకుతుంది అని వారి విశ్వసించారు. రాజకుమార్తె పుట్టినరోజున ఈ బతుకమ్మ పండుగను జరుపుకునేవారు. అమ్మవారిని భక్తితో ఆరాధిస్తూ ఈ పండుగను జరుపుకోవడం వల్ల శుభాలు కలుగుతాయని విశ్వసించేవారు.

Bathukamma Festival 2021: unique Festival of flowers, history, interesting stories

మహిషాసుర మర్ధినిగా మారిన అమ్మవారి అనుగ్రహం కోసం బతుకమ్మ సంబరాలు
ఇక మరో కథనం కూడా ప్రాచుర్యంలో ఉంది. బతుకమ్మ అంటే గౌరీదేవి అని అందరూ భావిస్తారు. గౌరీ దేవి పువ్వులను ఇష్టపడే ప్రేమికురాలు. కాబట్టి అమ్మవారిని వర్షాకాలం శీతాకాలం మధ్య వచ్చే సంధికాలంలో విరబూసే పువ్వులతో పూజిస్తారు అని చెప్తుంటారు. బతుకమ్మలను పేర్చి అమ్మవారిని పూజిస్తే పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా జీవిస్తారని మహిళలు విశ్వసిస్తారు. ఇక మరో కథనాన్ని చూస్తే కాకతీయ చక్రవర్తుల కాలం అంటే సుమారు 12 వ శతాబ్దం నుంచి ఈ పండుగ ఉన్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో పువ్వులను బతుకుగా భావించి పూజించేవారు. మహిషాసుర సంహారం కోసం అవతరించిన దుర్గాదేవి తొమ్మిది రోజుల్లో పెరిగి పెద్దదై రాక్షససంహారం చేయడంతో, ఆమె అనుగ్రహం కోరి మహిళలు చేసే ఆరాధనే బతుకమ్మ పండుగగా మారిందని కొందరి అభిప్రాయం.

గంగా గౌరీ సంవాదం.. గౌరీ దేవిని పూజించేలా బతుకమ్మ
మరో కథనంలో గంగా గౌరీ సంవాదంలో భాగంగా శివుడు తలపై గంగమ్మని పెట్టుకోవడం వల్ల అందరూ గంగను పూజిస్తున్నారు అని పార్వతీదేవి తన తల్లితో చెప్తుంది. అయితే పార్వతీదేవి తల్లి పార్వతిని ఓదార్చి గంగ మీద నిన్ను పూలతెప్పలా తేలించి పూజ చేసేలా చేస్తానని చెబుతుంది. ఆ తర్వాత బతుకమ్మగా పార్వతీ దేవిని పూజిస్తే మహిళలు పాడిపంటలు సంవృద్దిగా పండుతాయని ప్రచారం కాగా, అలా ప్రాచుర్యంలోకి వచ్చింది బతుకమ్మ పండుగ అని కొందరు చెబుతుంటారు. కాకతీయుల కాలంలో కరువుకాటకాలతో తీవ్ర దుర్భిక్ష నెలకొన్న సమయంలో, తొమ్మిది రోజుల పాటు పూలతో అమ్మవారిని బతుకమ్మగా పూజిస్తే కరువు కాటకాలు తీరుతాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని కూడా చెప్తుంటారు. ఇంకా కొన్ని జానపద కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.

బతుకమ్మ పండుగ వెనుక జానపదుల కథలు
పూర్వం అక్కెమ్మ అనే యువతికి ఏడుగురు అన్నలు ఉంటే ఆమె పెద్ద వదిన పాలల్లో విషం కలిపి మరదలికి తాగించి చంపేసిందని, ఆ తర్వాత ఊరి బయట పాతి పెట్టిందని అక్కడ అడవి తంగేడు చెట్టుగా పుట్టి విరగబూసింది అని మరో కథ కూడా ఉంది. ఊరికి వెళ్లి వచ్చిన అన్నలు చెల్లెకు కూల్ ఇద్దామని పోతే ఆమె ఆత్మ తన మరణం గురించి అన్నలకు చెబుతోందని అప్పుడు అన్నలు చెల్లెలికి ఏం కావాలో కోరుకొమ్మని అడుగగా ఈ తంగేడు పూలలో తనను చూసుకోమని, ప్రతి ఏటా బతుకమ్మ పేరుతో పండగ చేయండని చెప్పిందని, అలా ఈ పండుగ మొదలైందని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఇంకొక కథలో సంతానం లేని దంపతులకు ఓ బాలిక దొరకగా అమ్మవారి ప్రసాదంగా భావించి పెంచి పెద్ద చేస్తారు. ఇక ఆ బాలిక మహిమలు చూపిస్తూ, లోకహిత కార్యాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది. బతుకమ్మగా గౌరీ దేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది. అప్పటి నుండి బతుకమ్మగా గౌరీదేవిని పూజిస్తున్నారు అని చెప్తుంటారు.

బతుకమ్మ పండుగ ప్రత్యేకత నిరుపమానం
బతుకమ్మ పండుగ జరుపుకునే నేపథ్యం ఏదైనా, బతుకమ్మ వెనుక ఉన్న చరిత్ర ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను సంతరించి, దేశ విదేశాల్లోనూ ప్రత్యేకమైన కీర్తిని ఆర్జించింది బతుకమ్మ పండుగ. పాడిపంటలతో, సిరి సంపదలతో తులతూగాలని, మంచి వర్షాలతో వరుణదేవుడి అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని, అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతుల జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని బతుకమ్మ పండుగను యువతులు, ముత్తయిదువులు ఘనంగా జరుపుకుంటారు. భారతదేశంలో పండుగలకు విశిష్ట స్థానం ఉంటుంది. అందులో ముఖ్యంగా తెలంగాణా బతుకమ్మ పండుగకు ఉన్న ప్రత్యేకత నిరుపమానం.

English summary
Bathukamma Festival is a unique festival of flowers. Batukamma has been popular since the 12th century. There are so many stories about bathukamma history.
Related News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X