పెద్ద ఎన్టీఆర్, బాలయ్యతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఏకైక సినిమా
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'నందమూరి వంశం' పేజీలను తిరగేస్తే ఒక అద్భుతమైన వైభవం కనిపిస్తుంది. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ సృష్టించిన ఆ నట సామ్రాజ్యాన్ని, ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ తనదైన మాస్ ఇమేజ్‌తో నిలబెట్టారు. ఇక బాలయ్య తర్వాత ఆ సినీ వారసత్వ జెండాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన నటుడు జూనియర్ ఎన్టీఆర్ .
ప్రస్తుతం బాలయ్య, తారక్ ఇద్దరూ టాలీవుడ్‌లో టాప్ స్టార్స్‌గా దూసుకుపోతున్నారు. ఈ ముగ్గురు నందమూరి తరాల హీరోలు.. అంటే సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఒకే సినిమాలో నటించారనే విషయం చాలామందికి తెలియదు. బాలయ్యకు కొడుకుగా తారక్ నటించిన ఆ స్టోరీ గురించి తెలుసుకుందాం.

బాలయ్యకు కొడుకుగా
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' పౌరాణిక చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. అయితే, ఒకే సమయంలో ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ వెర్షన్‌లో కూడా షూట్ చేశారు. ఆ హిందీ వెర్షన్‌లోనే 'యంగ్ టైగర్' బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ హిందీ వెర్షన్‌లో సీనియర్ ఎన్టీఆర్ 'విశ్వామిత్రుడు'గా నటించగా, బాలకృష్ణ 'దుష్యంతుడు' పాత్ర పోషించారు. ఇక దుష్యంతుడు-శకుంతలల కుమారుడైన 'భరతుడు' పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించాడు. అంటే రీల్ లైఫ్‌లో బాలయ్యకు కొడుకుగా తారక్ నటించిన ఏకైక సినిమా ఇదే కావడం విశేషం.
అసలు తారక్‌కు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చిందనే దానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. హిందీ వెర్షన్ భరతుడి పాత్ర కోసం హిందీ స్పష్టంగా మాట్లాడగలిగే ఒక తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఎన్టీఆర్ వెతుకుతున్నారు. అదే సమయంలో 'మేజర్ చంద్రకాంత్' సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ తారక్ మాట్లాడిన హిందీ డైలాగులు, నైపుణ్యం చూసి అన్నగారు అవాక్కయ్యారు. తారక్ టాలెంట్‌కు ఫిదా అయిపోయి, వెంటనే 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ వెర్షన్ కోసం ఎంపిక చేసేశారు.
తెరపైకి రాని నందమూరి 'మహా కాంబో'
దురదృష్టవశాత్తూ, తెలుగులో విడుదలైన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' ఆశించిన స్థాయిలో ఆడలేదు. భారీ ఆర్థిక నష్టాలను మిగిల్చింది. దాంతో, అప్పటికే షూటింగ్ పూర్తయిన హిందీ వెర్షన్‌ను విడుదల చేయడానికి నిర్మాతలు సాహసించలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఆ ప్రాజెక్ట్ పూర్తిగా మూలన పడిపోయింది. అలా నందమూరి మూడు తరాల కలయికతో రూపొందిన ఆ అరుదైన హిందీ చిత్రం ఇప్పటికీ విడుదల కాకుండా అలాగే ఉండిపోయింది.
ప్రస్తుతం నందమూరి ఫ్యామిలీలో బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. అభిమానులు కూడా రెండు వర్గాలుగా విడిపోయి వాదించుకుంటూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ విషయాన్ని తమకు అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. బయట ఎన్ని ప్రచారాలు జరుగుతున్నా.. ఈ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఎప్పుడూ బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదు.












Click it and Unblock the Notifications