గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు: 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యంకనం
అమరావతి: గ్రూప్-1 పరీక్ష ఫలితాలపై దాఖలైన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వెలువరించింది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను పక్కన పెట్టాలని ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. 3 నెలల్లో మాన్యువల్‌గా మూల్యాంకనం చేసి ఫలితాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
ఏప్రిల్ 28న గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు ప్రకటించగా.. డిజిటల్ మూల్యాంకనంతో తమకు అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థుల్లు కోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ హైకోర్టులో 8 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. గ్రూప్-1 ప్రధాన పరీక్షలను నిబంధనల ప్రకారం నిర్వహించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

డిజిటల్ వాల్యూషన్ గురించి చివరి దశలో తెలిపారని హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తెలుగు మీడియం పేపర్లను రాష్ట్రంలోనూ, ఇంగ్లీష్ మీడియం పేపర్లను ఇతర రాష్ట్రాల్లోనూ వాల్యూషన్ చేశారని, దీంతో ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో వాల్యూషన్ ఎలా చేయిస్తుందని వాదించారు.
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను పక్కన పెట్టి కార్యదర్శి ఏకపక్షంగా వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు. ఇంటర్వ్యూలను నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వాలని కోరారు. మరోవైపు, నిబంధనల ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించామని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాల్యూషన్ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు గ్రూప్-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను పక్కన పెట్టాలని ఆదేశించింది. మూడు నెలల్లో మాన్యువల్ గా మూల్యంకనం చేసి ఫలితాలను ఇవ్వాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం.












Click it and Unblock the Notifications