TG EAPCET 2024 ResulTG: తెలంగాణ ఎంసెట్ ర్యాంకుల్లో టాప్ 2 ఏపీ విద్యార్ధులే..!
తెలంగాణలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈఏపీసెట్ 2024 పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఉదయం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. అలాగే కేటగిరీ వారీగా ర్యాంకులు కూడా ప్రకటించారు. ఇంజనీరింగ్ లో మొత్తం 2.4 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీల్లో దాదాపు లక్ష మంది పరీక్షలు రాశారు. వీరిలో ఇంజనీరింగ్ లో 75 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీల్లో 89 శాతం ఉత్తీర్ణులయ్యారు. eapcet.tsche.ac.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలు తెలుసుకోవచ్చు.
అయితే ఈసారి తెలంగాణ ఎంసెట్ పరీక్ష రాసిన వారిలో ప్రతీ కేటగిరీలోనూ టాప్ 10 ర్యాంకుల్ని అధికారులు ప్రకటించారు. ఇందులో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ మూడు విభాగాల్లోనూ టాప్ 2 ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులే నిలవడం విశేషం.ఇంజనీరింగ్ విభాగంలో తొలి ర్యాంకును ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన ఎస్ జ్యోతిరాదిత్య సాధించారు. రెండో ర్యాంకును కర్నూలు జిల్లా పంచలింగాలకు చెందిన హర్ష సాధించారు.

ఇంజనీరింగ్ లో పదో ర్యాంకు కూడా విజయనగరానికి చెందిన ధనుకొండ శ్రీనిధి సాధించారు. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో తొలి ర్యాంకును చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ప్రణీత కైవసం చేసుకున్నారు. రెండో ర్యాంకును విజయనగరానికి చెందిన రాధాకృష్ణ సాధించారు. మిగతా ర్యాంకులు మాత్రం తెలంగాణ విద్యార్ధులే సాధించారు. త్వరలో ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications