AP DSC 2024: ఏపీ డీఎస్సీ పరీక్షల తాజా షెడ్యూల్ ఇదేనా ?
ఏపీలో 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం గత నెలలో విడుదల చేసిన డీఎస్సీ షెడ్యూల్ ను హైకోర్టు నిన్న సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలకూ, డీఎస్సీ పరీక్షకూ మధ్య కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను అనుమతించిన హైకోర్టు.. ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. టెట్ ఫలితాలకూ, డీఎస్సీ పరీక్షలకూ కనీసం నెల రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు కొత్త షెడ్యూల్ పై ప్రభుత్వం దృష్టిసారించింది.
వాస్తవానికి ఈ ఏడాది జరగాల్సిన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వారం విడుదల కాబోతోంది. దీని ప్రకారం వచ్చే నెల రెండో, లేదా మూడో వారంలో ఎన్నికలు తప్పనిసరిగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7 కల్లా డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి అభ్యర్ధులకు అపాయింట్మెంట్ లెటర్లు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు హైకోర్టు అభ్యంతరాల నేపథ్యంలో ఈ తేదీలు కాస్తా మార్చుకోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో మార్చి 14న టెట్ ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం.. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వాలంటే ఏప్రిల్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు వీలుగా కొత్త షెడ్యూల్ సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఫలితాల విడుదల మరింత ఆలస్యం కానుంది. ఏప్రిల్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు వారం పాటు నిర్వహించినా ఏప్రిల్ 22 వరకూ జరుగుతాయి. ఫలితాల విడుదలకు మరో వారం ఎలాగో తప్పదు. అంటే ఏప్రిల్ చివర్లో ఫలితాలు వస్తాయి.
దీంతో ఎన్నికలతో సంబంధం లేకుండా డీఎస్సీ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన జరుగుతాయన్న మాట. దీంతో ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను పాటించే అవకాశాలే కనిపిస్తున్నాయి. అలా కాదని చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఎన్నికల పోలింగ్ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తే తిరిగి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. కానీ నెల రోజుల వ్యవధి విషయంలో సుప్రీంకోర్టు అయినా వెనక్కి తగ్గే అవకాశాలు ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications