AP Dsc 2024: డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్-దరఖాస్తు తేదీ పొడిగింపు-ఎడిట్ ఆప్షన్ కూడా..!
ఏపీలో ఎన్నికల వేళ నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్ష దరఖాస్తుల ప్రక్రియ తీరుపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు వస్తున్న వేళ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ, ఆన్ లైన్ లో సమర్పణ విషయంలో ఎదురవుతున్న సర్వర్ సమస్యలు, అలాగే ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ విషయంలో వచ్చిన వినతుల దృష్ట్యా ప్రభుత్వం దరఖాస్తుల గడువు పొడిగింపుతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది.

రాష్ట్రంలో 6100 టీచర్ పోస్టుల భర్తీ కోసం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్ధులకు కూడా ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన అంశంపై హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. బీఈడీ అభ్యర్ధుల్ని ఎస్జీటీ పోస్టులకు పరిణనలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఇప్పటికే సమర్పించిన దరఖాస్తుల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది.
డీఎస్సీ దరఖాస్తుల సమర్పణ విషయంలో అభ్యర్ధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఆన్ లైన్ సర్వర్ సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని ఇవాళ్టితో ముగుస్తున్న దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి డీఎస్సీ పరీక్షకు అన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఫీజు చెల్లింపుకు కూడా ఇవాళ్టితో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్ధులకు వెసులుబాటు ఇస్తూ ప్రభుత్వం మరో నాలుగు రోజుల పాటు గడువు పొడిగించింది. ఫిబ్రవరి 25 రాత్రి 12 గంటల వరకూ దరఖాస్తు చేసుకుని ఫీజు చెల్లించే అవకాశం కల్పించింది.
అలాగే హెల్ప్ డెస్క్ సమయాలను కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పొడిగిస్తూ మరో నిర్ణయం కూడా తీసుకుంది. మరోవైపు అభ్యర్ధులు ఇప్పటికే సమర్పించిన దరఖాస్తులకు తొలి రెండు రోజులు ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం, బీఈడీ అభ్యర్ధులు ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం వంటి సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించారు.
ఇప్పటికే డీఎస్సీ దరఖాస్తు సమర్పించిన అభ్యర్ధులు ముందుగా https://apdsc.apcfss.in/లోకి వెళ్లి ఇప్పటికే తాము సమర్పించిన అప్లికేషన్ ను డిలీట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పాత జర్నల్ నంబర్ తో తమ మొబైల్ కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అప్లికేషన్ లో మార్పులు చేసి తిరిగి ఎలాంటి ఫీజు చెల్లించకుండానే దరఖాస్తు సమర్పించవచ్చు. అయితే ఇందులో అభ్యర్ధి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన ఆప్షన్లను మార్చుకోవచ్చు.












Click it and Unblock the Notifications