అంబేద్కర్ ఓపెన్ వర్శిటీ బీఈడీ కోర్సు నోటిఫికేషన్-ఫీజు, ఎంట్రన్స్, అడ్మిషన్ల వివరాలివే..!
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంట్రన్స్ టెస్టు ఆధారంగా ప్రవేశాలకు అవకాశం కల్పిస్తోంది. ఓపెన్ విధానంలో తెలుగు రాష్ట్రాల విద్యార్ధులకు బీఎడ్ కోర్సును ఆఫర్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని 10 ప్రోగ్రామ్ సెంటర్ల నుంచి ఈ కోర్సును అభ్యసించేందుకు వీలు కల్పిస్తున్నారు.
పూర్తిగా తెలుగు మీడియంలోనే బీఈడీ ఓపెన్ విధానంలో పూర్తి చేయాలనుకునే అభ్యర్ధులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లే అయినా గరిష్టంగా నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తున్నారు. మ్యాథ్స్, ఫిజిక్, బయాలజీ, సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఒక దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంటర్, డిగ్రీ స్ధాయిలో ఈ కోర్సుల్లో ఒక దాన్ని అభ్యసించిన వారు బీఎడ్ లో వీటిని ఎంచుకోవచ్చు.

అంబేద్కర్ వర్శిటీ బీఎడ్ కోర్సు పూర్తి చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లో 10 సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక్కో సెంటర్ లో 50 సీట్ల చొప్పున మొత్తం 500 సీట్లు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ ఆంధ్ర మహిళాసభ టీచర్ ఎడ్యుకేషన్ కాలేజ్, హన్మకొండలో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, ఖమ్మంలో బౌన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పరిగిలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ అండ్ ఎగ్జిబిషన్ సొసైటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, కరీంనగర్ లోని ముకరంపురలో వాణి నికేతన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఈ సెంటర్లు ఉన్నాయి.
అలాగే ఏపీలో విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్, కర్నూల్లోనూ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్, గుంటూరు బ్రాడీపేటలో ఏఎల్ కాలేజీలో, కడప అన్నమాచార్య కాలేజీలో, శ్రీకాకుళంలోని మునసబ్ పేటలో గురజాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఈ సెంటర్లు ఉన్నాయి. వీటిలో రెండేళ్ల బీఏడ్ కోర్సు అభ్యసించవచ్చు. ఇందుకోసం ముందుగా మార్చి 5న జరిగే ఎంట్రన్స్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం అధికారిక వెబ్ సైట్ braouonline.inను సందర్శించాల్సి ఉంటుంది.
ఎంట్రన్స్ పరీక్ష కోసం ఆన్ లైన్లో ఫిబ్రవరి 21లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులకు రూ.1000, దివ్యాంగులకు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు రూ.750 ఎంట్రన్స్ దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. మార్చి 1 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూల్లో ఎంట్రన్స్ పరీక్షా కేంద్రాలు ఇస్తారు. పరీక్ష తర్వాత మార్చి 7న ప్రిలిమినరీ కీ విడుదల చేస్తారు. మార్చి 15న ర్యాంక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మార్చి చివరి వారంలో ఆడ్మిషన్ల కౌన్సెలింగ్ ఉంటుంది. రెండేళ్ల కోర్సు ఫీజు రూ.40 వేలుగా నిర్ణయించారు.












Click it and Unblock the Notifications