ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సర్వం సిద్దం.. రేపటి నుంచే ఎగ్జామ్స్ !
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రేపటి నుంచి (మే 3) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు పూర్తవ్వగా, మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి. రాజబాబు తెలిపారు. ఈ మెయిన్స్ పరీక్షలు మే 3 నుండి మే 9 వరకు కొనసాగనున్నాయి.
ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు పరీక్షలు నిర్వహించబడతాయి. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులకు హాలులోనే ఉండాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం వంటి నాలుగు ప్రధాన నగరాల్లో మొత్తం 13 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 4,496 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. వీరిలో విశాఖలో 1,190 మంది, విజయవాడలో 1,801 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది అభ్యర్థులు ఉన్నారు.

పరీక్షా రోజున అభ్యర్థులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్యలో తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో గరిష్ఠంగా 9:45 వరకు మాత్రమే ప్రవేశం అనుమతించబడుతుంది. ఆ తర్వాత వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది.
ఈసారి కూడా గతంలాగానే ప్రశ్నాపత్రాలు ట్యాబ్లెట్ల ద్వారా అందజేయనున్నారు. ఇన్విజిలేటర్లు అందజేసే బుక్‌లెట్‌లలోనే అభ్యర్థులు జవాబులు రాయాలి. బ్లాక్ లేదా బ్లూ బాల్‌పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. సెల్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications