JEE Mains 2025: భీమవరం విద్యార్ధులకు కార్గిల్ ఎగ్జామ్ సెంటర్ - ఎన్టీఏ షాకింగ్..!
జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పడుతున్న అపసోపాలు చూస్తూనే ఉన్నాం. ఓవైపు పరీక్ష పత్రాల లీకేజీలు, మరోవైపు పరీక్షల నిర్వహణలో అక్రమాలు, అసమర్థతతో విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ మరో విచిత్ర నిర్ణయం తీసుకుంది. ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్ధులకు త్వరలో జరిగే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్ష కోసం ఏకంగా కాశ్మీర్ లోని పరీక్ష కేంద్రాన్ని కేటాయించింది. దీంతో ఆయా విద్యార్ధులు, తల్లితండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని తిరుమల కాలేజీలో పడవల సాయి లోకేష్, కేతా తేజ చరణ్ అనే ఇద్దరు విద్యార్ధులు ఇంటర్ చదివారు. తాజాగా వీరిద్దరూ జేఈఈ మెయిన్స్ పరీక్ష కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 29న జరిగే మెయిన్స్ పేపర్ 1 పరీక్షతో పాటు 30న జరిగే పేపర్ 2 పరీక్ష రాసేందుకు వీరు దరఖాస్తు చేశారు. పరీక్ష కేంద్రాల కోసం భీమవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాజమండ్రి అప్షన్లు ఇచ్చారు. అయితే విచిత్రంగా ఇవన్నీ కాదని వీరికి కశ్మీర్లోని కార్గిల్ సెంటర్ ఇచ్చారు.

లేహ్ లడఖ్ పరిధిలోకి వచ్చే కార్గిల్ పరీక్ష కేంద్రాన్ని ఈ నెల 29న జరిగే జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పేపర్ 1 పరీక్ష కోసం వీరికి కేటాయించిన ఎన్టీఏ.. విచిత్రంగా ఆ తర్వాత రోజు అంటే జనవరి 30న పేపర్ 2 పరీక్షకు మాత్రం విశాఖలో సెంటర్ ఇచ్చారు. దీంతో ఎక్కడో 3 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాశ్మీర్ కు వెళ్లి పేపర్ 1 పరీక్ష రాసి 24 గంటల్లోపు తిరిగి విశాఖకు వచ్చి వీరు పేపర్ 2 పరీక్ష రాయాలన్న మాట. ఎన్టీఏ నిర్ణయంపై వీరు ఇప్పటికే హెల్ప్ లైన్ లో సంప్రదించినా, మెయిల్స్ చేస్తున్నా స్పందన లేదని చెబుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించి కేంద్రంతో మాట్లాడి పరీక్ష కేంద్రం మార్చేలా చూడాలని వీరి తల్లితండ్రులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications