TG DSC : రేపటితో ముగియనున్న డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడో తెలుసా..?
తెలంగాణ డీఎస్సీ పరీక్షలు రేపటి (ఆగస్టు 5)తో ముగియనున్నాయి. గత నెల (జులై) 18వ తేదీన ప్రారంభమైన ఈ డీఎస్సీ పరీక్షలు 2024 రేపటితో పూర్తికానున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ పరీక్ష ఫలితాలపై దృష్టి సారించింది. వీలైనంత త్వరగా ఉపాధ్యాయుల నియామకాలను పూర్తిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సెప్టెంబర్ 5వ తేదీలోపు అన్నీ ప్రక్రియలను పూర్తిచేసి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొత్తగా వచ్చిన టీచర్ల సేవలను ఉపయోగించుకోవాలని విద్యాశాక భావిస్తున్నట్లు సమాచారం. ఏదిఏమైనా పరీక్షలు ముగిసిన వెంటనే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

రాష్ట్రంలో మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించింది. ఇక, పోస్టుల వారీగా వివరాలను ఓ సారి పరిశీలిస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182 పోస్టులు, ఎస్జీటీలు 6,508 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు 220, స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ఇక, ఈ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,79,966 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు జులై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న14 జిల్లాల్లో 56 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. రేపటితో డీఎస్సీ పరీక్షలు ముగియనున్నాయి.
ఈ నెల చివరి వారంలోనే ఫలితాలు..
డీఎస్సీ పరీక్షలు ముగిసిన వెంటనే ప్రాథమిక కీ ను విడుదల చేసే విధంగా విద్యాశాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ కీని విడుదల చేస్తారు. అనంతరం జనరల్ ర్యాకింగ్ జాబితాను విడుదల చేసి, దృవపత్రాల వెరిఫికేషన్ ప్రారంభించి, ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్షల అనంతరం ఫలితాలను త్వరగా విడుదల చేయాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు సమాచారం.
ఆగస్టు చివరి వారంలోపే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు నిరసనలు తెలిపినప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలను యథావిథిగా నిర్వహించింది. ప్రకటించిన షెడ్యూల్ లోపే పరీక్షలను పూర్తి చేసి, నూతన ఉపాధ్యాయుల రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.












Click it and Unblock the Notifications