సోమరిపోతుల కోసమేనట.. శివాజీ మాటలతో కొత్త వివాదం!
ఓటీటీ వర్సెస్ థియేటర్ల వివాదం చలనచిత్ర పరిశ్రమను మళ్లీ వేడెక్కించింది. సీనియర్ నటుడు శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆయన చేసిన కామెంట్స్ తాజాగా చర్చకు దారితీశాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం 'ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్' మూవీ ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై నేరుగా విమర్శలు గుప్పించారు. ఓటీటీ అనేది కేవలం సోమరిపోతుల కోసమేనని ఆయన అభివర్ణించారు. ఇంట్లోనే కూర్చుని సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసే అలవాటు ప్రేక్షకుల్లో పెరిగిపోవడం వల్ల థియేటర్లకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన '#90s-మై మిడిల్ క్లాస్ బయోపిక్' వెబ్ సిరీస్ గురించి శివాజీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఈ సిరీస్‌ను ఓటీటీకి బదులుగా నేరుగా థియేటర్లలో విడుదల చేసి ఉంటే.. అది సులువుగా రూ.100 కోట్ల మార్కును దాటి ఉండేదని శివాజీ ధీమా వ్యక్తం చేశారు. మిడిల్ క్లాస్ భావోద్వేగాలు, సరళమైన కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
శివాజీ చేసిన ఈ కామెంట్లపై నెటిజన్లు, సినీ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది ఆయన మాటలతో ఏకీభవిస్తూ.. ఓటీటీల వల్ల థియేటర్లకు వెళ్లే సంస్కృతి తగ్గుతోందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం థియేటర్ టికెట్ల ధరలు, తినుబండారాల ఖర్చులు విపరీతంగా పెరగడం వల్లే కుటుంబ సమేతంగా వెళ్లి సినిమా చూడటం కంటే ఓటీటీనే సులువైన మార్గంగా ఎంచుకుంటున్నామని అభిప్రాయపడుతున్నారు.
వివాదాస్పదంగా మారిన చర్చ
విచిత్రమేమిటంటే.. శివాజీకి సెకండ్ ఇన్నింగ్స్ లో విపరీతమైన క్రేజ్, పాపులారిటీని తెచ్చిపెట్టింది కూడా అదే ఓటీటీ ప్లాట్‌ఫామ్ కావడం. ఓటీటీ ద్వారా విజయం సాధించిన ఓ కథ, థియేటర్లలో కూడా అంతే స్థాయిలో రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించగలదా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.














Click it and Unblock the Notifications