నా మీద చేతులు వేశాడు, ఆ నరకం గుర్తొస్తే ఇప్పటికీ వణుకే: స్టార్ యాంకర్
బుల్లితెరపై ఎప్పుడూ చిరునవ్వుతో, చలాకీతనంతో కనిపిస్తూ ప్రేక్షకులను అలరించే యాంకర్ సౌమ్యా రావు వెనుక ఎవరికీ తెలియని ఓ కన్నీటి గాథ ఉంది. నేడు స్టార్ యాంకర్‌గా వెలుగుతున్న ఆమె.. ఒకప్పుడు తిరుపతి బస్టాండ్‌లో ఆకలితో అలమటించిన రోజులను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమైంది. కటిక పేదరికం నుంచి వేధింపుల వరకు.. సౌమ్యారావు ఎదుర్కొన్న హృదయవిదారక అనుభవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తిరుపతి బస్టాండ్‌లో ఆకలితో అలమటించిన రోజులు
సౌమ్యారావు తన చిన్నతనంలో తండ్రి చేసిన అప్పుల కారణంగా కుటుంబం ఎంతటి నరకాన్ని అనుభవించిందో కన్నీటి పర్యంతమై వివరించింది. అప్పులవాళ్లు ఇంటికి వచ్చి తన తల్లిని వేధిస్తుంటే చూడలేక.. ఒకరోజు తన తల్లి, తమ్ముడితో కలిసి కేవలం 100 రూపాయలతో తిరుపతికి పారిపోయినట్లు తెలిపింది. అక్కడ తలదాచుకోవడానికి చోటు లేక రాత్రంతా బస్టాండ్‌లోనే గడిపామని.. రెండు రోజుల పాటు అన్నం కూడా లేక కేవలం అన్నదానం ఎప్పుడు పెడతారా అని ఆకలితో ఎదురుచూశామని ఆమె గుర్తుచేసుకుంది. కనీసం వాష్‌రూమ్ సౌకర్యం కూడా లేని ఆ భయంకరమైన పరిస్థితుల్లో పీరియడ్స్ రావడం తనను మరింత కుంగదీసిందని ఎమోషనల్ అయ్యింది.

లాయర్ అసభ్య ప్రవర్తన
జీవితం గడవడానికి సౌమ్యారావు చిన్న వయసు నుంచే ఎన్నో పనులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఓ లాయర్ దగ్గర టైపిస్ట్‌గా పార్ట్ టైమ్ ఉద్యోగంలో చేరినప్పుడు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సౌమ్యారావు బయటపెట్టింది. తన పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న ఆ లాయర్.. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని.. తన మీద ఇష్టం వచ్చినట్లు చేతులు వేస్తూ వేధించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆ పనిని వదిలేసినట్లు సౌమ్య పేర్కొంది. పెన్ను, పెన్సిల్ కొనడానికే కూడా అప్పు చేయాల్సిన స్థితి నుంచి సెకండ్ హ్యాండ్ పుస్తకాలతో చదువుకుని నేడు ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె వెల్లడించింది.
క్యాన్సర్‌తో పోరాటం.. తల్లి కోసం తపన
సౌమ్యారావు కెరీర్లో నిలదొక్కుకుంటున్న సమయంలోనే ఆమె తల్లికి బ్రెయిన్ క్యాన్సర్ రావడం పెద్ద దెబ్బగా మారింది. ఆమె చికిత్స కోసం తన వద్ద ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేయడమే కాకుండా.. ఎంతో మంది వద్ద సహాయం కోరినట్లు చెప్పింది. రేడియోథెరపీ చేయించినా పరిస్థితి విషమించడంతో తన తల్లి చిన్నపిల్లలా మారిపోయిందని.. అప్పటి నుంచి ఆమెకు కూతురిలా కాకుండా ఓ తల్లిగా మారి సపర్యలు చేశానని సౌమ్యారావు ఎమోషనల్ అయ్యింది. తల్లిని కోల్పోయిన బాధ ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉందని ఆ టాక్ షోలో చెప్పుకొచ్చింది.
గుర్తింపునిచ్చిన జబర్దస్త్.. నేడు స్టార్ యాంకర్‌గా..!
కన్నడలో నటిగా ప్రయాణం మొదలుపెట్టి తమిళ సీరియల్స్‌లో గుర్తింపు పొందిన సౌమ్య.. తెలుగులో 'శ్రీమంతుడు' సీరియల్ ద్వారా అడుగుపెట్టింది. అయితే, అనసూయ, రష్మీల తర్వాత 'జబర్దస్త్' వేదికపై యాంకర్‌గా వచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుంది. తన ఇంగ్లీష్ యాక్సెంట్, చలాకీతనం, స్పాంటేనియస్ పంచ్‌లతో అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెరపై నవ్వుతూ కనిపించే ఈ యాంకర్ వెనుక ఇన్నేసి కష్టాలు ఉన్నాయని తెలిసి నెటిజన్లు ఆమె ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications