ఎన్టీఆర్ 'దేవర'కు డబుల్ షాక్ ఇవ్వబోతున్న చంద్రబాబు ప్రభుత్వం?
భారీ నిర్మాణ సంస్థలు అగ్ర కథానాయకులతో అత్యంత వ్యయాన్ని వెచ్చించి సినిమాలు తీసినప్పుడు మొదటి రెండు వారాలు థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలను అనుమతి కోరడం ఆనవాయితీగా వస్తోంది. సినిమాకు పెట్టిన పెట్టుబడిని త్వరగా రాబట్టుకునేందుకు పలువురు నిర్మాతలు ఈ పద్ధతినే ఫాలో అవుతున్నారు. ఇటీవలే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అశ్వనీదత్ నిర్మించిన కల్కి చిత్రానికి అనుమతిచ్చాయి. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర వంతు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సెప్టెంబరు 27వ తేదీన విడుదల కాబోతోంది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం విడుదల కాబోతుండటం విశేషం.
సన్నిహిత సంబంధాలు లేవు
దేవరను ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. నందమూరి కుటుంబ సభ్యులతోపాటు చంద్రబాబు కుటుంబ సభ్యులతో కూడా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కు సన్నిహిత సంబంధాలు లేవు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో కూడా వీరిద్దరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మౌనం వహించారు. జగన్ ప్రభుత్వంలో కొడాలి నాని, వల్లభనేని వంశీలాంటివారు చంద్రబాబు, బాలయ్యతోపాటు భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులపై తీవ్రమైన మాటల దాడి చేసినప్పటికీ వీరిని నియంత్రించడానికి తారక్ ప్రయత్నించలేదని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

వారిద్దరిపై మండిపడుతున్న బాలయ్య
తాజాగా హైదరాబాద్ నోవాటెల్ లో జరిగిన బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ కు తారక్, కల్యాణ్ రామ్ హాజరుకాలేదు. వీరిద్దరికీ ఆహ్వానం లేదని వార్తలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ నందమూరి కుటుంబ సభ్యులకు ఆమడదూరంలో ఉంటూ తమపని తాము చూసుకుంటున్న తారక్ సినిమా దేవరకు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు లభిస్తుందా? లేదా? అనేది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సమయంలో మాత్రం ఎన్టీఆర్ ట్వీట్ చేయగా దానికి చంద్రబాబు థాంక్యూ అమ్మా అటూ బదులిచ్చారు.
అంతకుమించి వీరిమధ్య ఎటువంటి సంబంధాలు లేవు. ప్రధానంగా బాలకృష్ణ అయితే తారక్, కల్యాణ్ రామ్ పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో దేవర సినిమాకు టికెట్ ధరల పెంపునకు సంబంధించి అనుమతులు రావడం కష్టమేనని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలంగాణలో మాత్రం అనుమతి వస్తుందంటున్నారు. ఇటువంటి వివాదాలన్నీ ఎందుకులే సినిమాల దారి సినిమాలదే అనుకుంటే దేవర చిత్రానికి అనుమతులు వచ్చే అవకాశాలున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications