దియా మీర్జా దీపావళి వీడియో వివాదం.. సెలబ్రిటీ గొంతు నొక్కుతున్నారా?
కాలుష్య రహితంగా దీపావళి పండుగను జరుపుకోవాలంటూ ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా చేసిన విజ్ఞప్తి ఇప్పుడు కొత్త వివాదానికి దారి తీసింది. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన ఓ సాధారణ అవగాహన ప్రచారం కాస్తా.. సామాజిక అంశాలపై సెలబ్రిటీలు మాట్లాడొచ్చా లేదా అనే సరికొత్త చర్చకు తెరలేపింది.
వివాదం ఎలా మొదలైందంటే?
బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ముంబై నగరంలో కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించేందుకు బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) నటి దియా మీర్జాతో ఓ ప్రచార వీడియోను రూపొందించింది. బాధ్యతాయుతంగా దీపావళి జరుపుకోవాలని ఆమె అందులో కోరారు. అయితే ముంబై బీజేపీ అధ్యక్షడు అమీత్ సతమ్ ఈ ప్రచారాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. పండుగలను ఎలా జరుపుకోవాలో ప్రజలకు పాఠాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

వీడియో తొలగింపు.. దియా మీర్జా స్పందన
బీజేపీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో బీఎంసీ తన సోషల్ మీడియా ఖాతాల నుంచి దియా మీర్జా వీడియోను తొలగించింది. అయితే ఇదే అంశంపై ఇతర ప్రముఖులు చేసిన విజ్ఞప్తి వీడియోలు మాత్రం సోషల్ మీడియాలో అలాగే ఉండటం గమనార్హం. ఈ వివాదంపై దియా మీర్జా స్పందిస్తూ.. "బాంబే హైకోర్టు సూచనల మేరకు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీఎంసీ విజ్ఞప్తి మేరకు మాత్రమే నేను ఈ వీడియోలో నటించాను. దీని కోసం నేను ఎలాంటి ప్రతిఫలం తీసుకోలేదు" అని స్పష్టం చేశారు.
ముగింపు లేని ప్రశ్నలు
ఈ ఘటన ఓ పెద్ద ప్రశ్నను సమాజం ముందుకు తెచ్చింది. సాధారణంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి సెలబ్రిటీల ప్రజాదరణను ప్రభుత్వాలు, సంస్థలు ఉపయోగిస్తుంటాయి. అయితే వారు చెప్పే విషయాలు కొందరికి నచ్చనంత మాత్రాన వారి గొంతును నొక్కడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నటిగా రంజింపజేయడమే వారి పని కావచ్చు.. కానీ కెమెరా ముగిసినంత మాత్రాన ఓ పౌరురాలిగా సామాజిక అంశాలపై మాట్లాడే హక్కు వారికి ఉండదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.














Click it and Unblock the Notifications
