చిరంజీవి కథలో వేలు పెడితే, బాలయ్య చెప్పింది చేస్తాడు: డైరెక్టర్ బాబీ
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా అగ్ర కథానాయకులుగా చెలామణి అవుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. వీరిద్దరి నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఇరు హీరోల అభిమానుల మధ్య హోరాహోరీ యుద్ధం నడిచేది. ఇప్పుడు కూడా నడుస్తోంది. నిజ జీవితంలో వీరిద్దరూ మంచి స్నేహంగా ఉంటున్నప్పటికీ వృత్తిపరంగా వచ్చేసరికి అభిమానులు మాత్రం అలా ఉండటంలేదు. వాస్తవానికి వచ్చే ఏడాది సంక్రాంతికి వీరిద్దరి సినిమాలు పోటీపడాల్సి ఉంది. అయితే విశ్వంభరను మే నెలకు వాయిదా వేయడంతో యుద్ధం తప్పిపోయింది. గతేడాది సంక్రాంతికి కూడా వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో పోటీపడి ఇద్దరూ సూపర్ హిట్లు కొట్టిన సంగతి తెలిసిందే.
దర్శకుడిని బాలయ్య గుడ్డిగా నమ్ముతారు
బాబీ దర్శకత్వంలో ప్రస్తుతం సినిమా చేస్తున్న బాలయ్య వచ్చే సంక్రాంతికి ఢాకు మహరాజ్ పేరుతో రాబోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు బాబీ తాను చిరంజీవి, బాలయ్యతో సినిమాలు చేయడంతో వారి పనితీరుపై తనకున్న అనుభవాలను వివరించారు. చిరంజీవి ప్రతి పనిపై శ్రద్ధపెడతారని, దర్శకుడిని ముందుగా డైలాగుల పేపరు అడుగుతారని, కథ చెబితే దాన్నిగురించి ప్రతిసారీ అడుగుతుంటారని చెప్పారు. బాలకృష్ణ విషయానికొస్తే ఆయనకు ఒకసారి కథ వినిపిస్తే, ఆయనకు నచ్చితే సరే అంటారని, ఇక దాన్నిగురించి మాట్లాడరని చెప్పారు. షూటింగ్ సెట్స్ కు వచ్చిన తర్వాత దర్శకుడు ఏది చెబితే అదే చేస్తారని, దాన్నే ఫాలో అవుతారని, దర్శకుడిమీద నమ్మకంతో ఆయన్ను గుడ్డిగా నమ్మి సినిమాలు చేస్తారని చెప్పారు.

సోషల్ మీడియాలో వైరలవుతున్న బాబీ కామెంట్స్
ప్రస్తుతం బాబీ చెప్పిన విషయాలను చిరంజీవి, బాలకృష్ణ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సినిమాలో చిరంజీవి వేలు పెడతాడని, స్క్రిప్ట్ లో కలగజేసుకుంటాడని, కథను డిస్టర్బ్ చేస్తుంటాడనేదానికి బాబీ చెప్పిన విషయాలే సాక్ష్యాలని బాలయ్య అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే వీరి కామెంట్లను చిరంజీవి అభిమానులు తిప్పికొడుతున్నారు. సినిమా ఎంత బాగా రావాలి, అభిమానులకు నచ్చాలంటే ఎటువంటి విషయాలుండాలి అనేది ఒకటికి నాలుగుసార్లు చెక్ చేసుకోవడం అవసరమని, చిరంజీవి అదే చేస్తున్నారని, అందులో తప్పేం ఉందని చిరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇరు హీరోల సినిమాలు ఏమీ లేకపోయినప్పటికీ బాబీ చెప్పిన విషయాలమీద మాత్రం ప్రస్తుతం మళ్లీ సోషల్ మీడియాలో యుద్ధం నడుస్తోంది.












Click it and Unblock the Notifications